పోలవరం నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం 

పోలవరం ప్రాజెక్ట్ క్రింద నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ప్యాకేజీని అమలు పరచకుండా వారిని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాల పట్ల జాతీయ మానవహక్కుల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ప్రాజెక్ట్ పరిధిలోని రాంపా ఏజెన్సీ  సీతారాం గ్రామంలో ఆ విధంగా 16 గృహాల కూల్చివేతపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆ విధంగా కూల్చివేతపై 8 వారాల లోగా తగు చర్య తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ని ఆదేశించింది.  మార్చ్ 10న అధికారులు ఆ గృహాలను కూల్చివేశారని ఆరోపిస్తూ  రంపచోడవరంకు చెందిన రైట్స్ వాచ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు బాలు అక్కిస ఇచ్చిన ఫిర్యాదుకు స్పందిస్తూ హక్కుల కమీషన్ ఈ  ఆదేశం జారీచేసింది. 
 
ఆర్ ఆర్ ప్యాకేజి మార్గదర్శక సూత్రాల ప్రకారం హామీ ఇచ్చిన విధంగా గిరిజనులకు ప్రత్యామ్న్యాయ గృహ సదుపాయం కల్పించకుండా రెవిన్యూ అధికారులు గిరిజనుల గృహాలను కూల్చివేశారని బాలు అక్కిస తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును కమీషన్ జిల్లా కలెక్టర్ కు పంపిస్తూ  దానిపై తీసుకున్న చర్యలను బాలు అక్కిసకు తెలపాలని కోరింది.
ఇలా ఉండగా,  రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారిపట్ల ప్రతి ఒక్కరం కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఈ విషయాన్ని విస్మరించి పోలవరం ముంపు ప్రాంతవాసుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ముంపు ప్రాంత పరిధిలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో అధికార యంత్రాంగం అనుసరించిన దుందుడుకు విధానాలు.. జేసీబీలతో ఇళ్లను కూల్చి వేసి, ప్రజలు నివసిస్తూ ఉండగానే విద్యుత్‌ సరఫరా, ఇతర సదుపాయాలు నిలిపివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో జనసేన బృందం ఆ ప్రాంతాల్లో పర్యటించి, నిర్వాసితులతో మాట్లాడి, అక్కడి పరిస్థితిని తెలుసుకుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 

నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించి, అక్కడ అన్ని సదుపాయాలు కల్పిండంతోపాటు 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడినీ, యువతినీ పరిహారం ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని, ఆ తర్వాతే తరలించాలని స్పష్టం చేశారు.