యూనిఫాం సివిల్ కోడ్‌ ఎలా పనిచేస్తుందో గోవాలో చూడండి 

మేధావులు గోవాకు వచ్చి యూనిఫాం సివిల్ కోడ్‌ (యూసీసీ) ఎలా పనిచేస్తుందో చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బొబ్డే పిలుపునిచ్చారు.  ఒక విధంగా ఏకరీతి పౌరస్మృతిపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు శ్రీకారం చుట్టారు. ‘రాజ్యాంగం రూపొందించినవారు భారతదేశానికి సంబంధించిన కోడ్‌ను ఊహించారు. దేశంలోని మేధావులు గోవాను సందర్శించి ఏకరీతి పౌరస్మృతి ఎలా పనిచేస్తుందో చూడాలి’ అని సీజేఐ బొబ్డే  సూచించారు.

గోవాలోని బొంబాయి హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభిస్తూ ‘భారతదేశం కోసం రాజ్యాంగం రూపకర్తలు తీసుకొచ్చిన కోడ్‌లన్నింటిని గోవా కలిగి ఉన్నది. ఆ కోడ్ క్రింద విచారణ నిర్వహించే అధికారాన్ని సీజేఐగా నేను కలిగి ఉన్నాను’ అని కొనియాడారు. ఇది మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా అందరు గోవా ప్రజలకు వివాహం, వారసత్వంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు.

 “నేను యూనిఫాం సివిల్ కోడ్ గురించి చాలా విద్యా చర్చలు విన్నాను. మేధావులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అందిస్తున్న న్యాయ పరిపాలనను చూడాలని నేను కోరుతున్నాను. అప్పుడే అదేమిటో మీకందరికీ తెలుస్తుంది” అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సీజేఐ చెప్పారు.

భారతదేశంలో యూసీసీ ఉన్న ఏకైక రాష్ట్రం గోవా. తద్వారా ఇక్కడి వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరినీ పరిపాలించే ఏకరీతి వ్యక్తిగత చట్టాలు ఇక్కడ అమలులో ఉన్నాయి. భారతదేశ భూభాగం అంతటా ఏకరీతి పౌరస్మృతి.. పౌరులందరికీ భద్రత కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 వెల్లడిస్తున్నది.

యూసీసీ తీసుకొస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీగా పేర్కొన్నది. ఏకరీతి పౌరస్మృతిని అమలుచేయాలంటూ బీజేపీ సీనియర్‌ నాయకుడు, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. 

వివిధ అంశాలపై దాఖలైన పిల్స్‌ను సుప్రీంకోర్టు విడివిడిగా విచారిస్తున్నది. సీజేఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. రెండేండ్ల కాల వ్యవధిలో యూసీసీ అమలుపై కేంద్రం వైఖరిని తెలుపాలంటూ సుప్రీంకోర్టు రెండు సార్లు నోటీసులు పంపింది.