బీజేపీ మ‌హిళా నేత ముఖంపై ప్ర‌మాద‌క‌ర రసాయనం 

ఓటమి భయంతో పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మూకలు బిజెపి నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, బీజేపీ మ‌హిళా నేత, లోక్ సభ సభ్యురాలు లాకెట్ చ‌ట‌ర్జి ముఖంపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలతో కూడిన రంగుల‌ను చ‌ల్లారు. లాకెట్ చ‌ట‌ర్జీ శ‌నివారం హుగ్లీ జిల్లాలో ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

హుగ్లీలో ఓ కార్య‌క్ర‌మంలో ఉండ‌గా త‌న‌ ముఖంపై ఒక్క‌సారిగా ఘాటైన రంగులు పోశార‌ని, దాంతో ఎవ‌రు ఆ రంగులు చ‌ల్లారా అని క‌ళ్లు తెరిచి చూసేస‌రికి ఎదురుగా టీఎంసీ బ్యాడ్జి ధ‌రించిన ముగ్గురు, న‌లుగురు వ్య‌క్తులు క‌నిపించార‌ని, వాళ్లే ఈ ప‌ని చేసి ఉంటార‌ని లాకెట్ చ‌ట‌ర్జి ఆరోపించారు.

ఆమె హుగ్లీ జిల్లాలోని చింసూరహ్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. మొదటి విడత పోలింగ్ సందర్భంగా శనివారం పెద్దయెత్తున 80 శాతం వరకు ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చి ఓట్ వేస్తుండగా ఎన్నికలు జరుగుతున్న ఐదు జిల్లాలో కూడా హింసాయుత సంఘటనలు జరుగుతూనే ఉండడం గమనార్హం. 

తృణమూల్ గూండాలు బిపి ప్రధాన్ బిద్యుత్ బిస్వాస్ నేతృత్యంలో ఆమెపై దాడి జరిపారని బెంగాల్ బిజెపి ఆరోపించింది. కొందరు మహిళలు, బాలలతో కలసి ఆమె హోలీ ఉత్సవంలో పాల్గొంటూ ఉండగా, ఆమెపై రంగులు చల్లడం కోసం కొందరు మహిళలు ముందుకు రాగా, కరోనా కారణంగా వద్దని ఆమె వారించారు. 

కానీ ఇద్దరు, ముగ్గురు యువకులు రంగులు వేయించుకోవలసిందే అని బలవంతం చేస్తూ ఆమె ముఖంపై రంగులు చల్లారని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.