30న రాష్ట్రపతికి బైపాస్‌ సర్జరీ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయనకు ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారని రాష్ట్రపతి భవన్‌ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 

75 ఏళ్ల కోవింద్‌ ఛాతీలో నొప్పి కారణంగా శుక్రవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం ఆయనను అక్కడి నుంచి ఎయిమ్స్‌కు తరలించారు. 

వైద్య నిపుణుల సలహా మేరకు ఈ నెల 30వ తేదీ ఉదయం రాష్ట్రపతికి బైపాస్‌ సర్జరీ చేయాల్సి ఉందని, అందుకు తగిన చికిత్స అందించేందుకు వీలుగా ఎయిమ్స్‌కు తరలించారని ఆ ప్రకటన పేర్కొంది. 

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి  ఆయనను పరామర్శించారు. బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కోవింద్‌ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడి, రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన వారికి కోవింద్‌ ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.