నందిగ్రామ్ బిజెపి నేతకు మమతా ఫోన్!

నందిగ్రామ్ నుండి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న  టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ స్థానిక బిజెపి నేత ఒకరికి ఫోన్ చేసి, మద్దతు ఇవ్వమని కోరిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. నందిగ్రామ్  నియోజకవర్గంలో ఏప్రిల్ 1న పోలింగ్ జరుగుతుంది. ఆమె తన పాత మిత్రుడు, బిజెపి మిత్రుడు  సువేందు అధికారితో ఇక్కడి నుంచి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శనివారం ఓ ఆడియోను విడుదల చేసింది.

ఓ వైపు తొలి దశ ఓటింగ్ జరుగుతుండగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని మమత బెనర్జీ నందిగ్రామ్‌కు చెందిన బీజేపీ నేత ప్రళయ్ పాల్‌ను కోరినట్లు బీజేపీ ఆరోపించింది. తిరిగి టిఎంసిలో చేరి, తన గెలుపుకు సహకరింపమని అందులో ఆమె కోరారు.

అయితే మమత అభ్యర్థనను ప్రళయ్ తిరస్కరించారని తెలిపింది. తనకు టీఎంసీలో గౌరవం దక్కలేదని చెప్పారని తెలిపింది. సువేందు అధికారికి, బీజేపీకి తాను ద్రోహం చేయలేనని మమతకు ప్రళయ్ చెప్పినట్లు తెలిపింది. ఆ విషయాన్నీ ఆయన మీడియా ముందు కూడా వెల్లడించారు. “నేను బిజెపి కోసం పనిచేస్తున్నాను. ఈ దశలో ఆ పార్టీకి వెన్నుపోటు పొందవలెను” అని స్పష్టం చేశారు.

ఈ ఆడియోను విడుదల చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ ఇన్ ఛార్జ్  కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ఈ సంభాషణనుబట్టి నందిగ్రామ్‌లో ఓటమిని మమత బెనర్జీ అంగీకరించినట్లు అర్థమవుతోందని స్పష్టం చేశారు. విజయవర్గీయ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి వర్గం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను కలసి ఆ ఆడియోను అందజేశారు. ఆమె తన అధికార హోదాను ఉపయోగించి ఎన్నికలలో గెలిచేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని అంటూ ఆరోపించారు.

బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నాయకులను టీఎంసీ బెదిరించడం ఆమోదయోగ్యం కాదన్నారు. టీఎంసీ కేడర్ పాల్పడుతున్న హింసాత్మక చర్యలకు ఇది కొనసాగింపు అని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమత బెనర్జీ ఓడిపోతారని జోస్యం చెప్పారు.