అవినీతిలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు దొందూ దొందే

అవినీతిలో అధికార ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు దొందూ దొందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఏళ్ల తరబడి ఆ రెండు కూటములు అవినీతికి ఆలవాలమయ్యాయని, ప్రజలు వాళ్లకు ఉద్వాసన చెప్పేందుకు తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. 

కేరళలోని ధర్మడం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సీకే పద్మనాభన్ తరఫున జరిగిన రోడ్‌షోలో నడ్డా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై పద్మనాభన్ పోటీ చేస్తున్నారు. యూడీఎఫ్ ప్రభుత్వంలో ‘సోలార్ స్కామ్’ వెలుగుచూస్తే, ప్రస్తుత ఎల్‌డీఎఫ్ పాలనలో ‘గోల్డ్ స్కామ్’ చోటుచేసుకుందని ఈ సందర్భంగా నడ్డా గుర్తు చేశారు.

రెండు సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయముందని ఆరోపించారు. ఈ రెండు అవినీతి కేసులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. సీపీఎం, కాంగ్రెస్‌లు కేరళ, పశ్చిమబెంగాల్‌లో సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఎద్దేవా చేశారు. కేరళలో ఒకరితో ఒకరు తలపడుతుండగా, పశ్చిమబెంగాల్‌లో కలిసి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. కేరళ దైవభూమి అని, కేరళ అభివృద్ధికి మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నడ్డా చెప్పారు.

2014 నుంచి కేరళలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని ఈ సందర్భంగా నడ్డా వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన దాని కంటే ఇది మూడు రెట్లు అధికమని తెలిపారు. కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన పద్మనాభన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్.హరిదాస్ తదితరులు ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు.