తమిళ భాషా సంస్కృతులను కాపాడతాం

తమిళ భాష, సంస్కృతీ సంప్రదాయాలను కంటికి రెప్పలా కాపాడుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భరోసా ప్రకటించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి  రాష్ట్రానికి వచ్చిన ఆయన దిట్టక్కుడి, చెన్నైలలో అన్నాడీఎంకే-బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేపట్టారు.

చెన్నై హార్బర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం, దిట్టక్కుడి బీజేపీ అభ్యర్థి పెరియసామిలకు మద్దతుగా ఓటర్లను  ఉద్దేశించిప్రసంగిస్తూ తమిళుల ఆరాధ్యదైవం సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కీర్తించే స్కంధషష్టిని కరుప్పర్‌ కూట్టమ్‌ కించపరిస్తే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్రమంతటా వేల్‌యాత్రలు నిర్వహించి ఆ కీర్తనల కీర్తి ప్రతిష్టలను కాపాడిందని చెప్పారు. ఈ కారణంగానే హేతువాదిగా డంబాలు పలికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సైతం చేత వేల్‌ (శూలాన్ని)ను పట్టుకున్నారని తెలిపారు. ఈ సంఘటనతో తమిళ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడగలిగేది బీజేపీయేనని రుజువైందని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రగతి కోసం అన్నాడీఎంకే బీజేపీ మెగా కూటమిని ఏర్పాటు చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని, డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలలో వారసత్వ రాజకీయాలే ప్రధానమని విమర్శించారు.  తమిళనాట డీఎంకేలో త్రీజీ (మూడుతరాలు – కరుణానిధి, స్టాలిన్‌, ఉదయనిధి), కాంగ్రెస్‌లో 4జీ (నాలుగు తరాలు- నెహ్రూ,ఇందిరా, రాజీవ్‌, సోనియా గాంధీ)  వారసులదే రాజ్యంగా వుంటోందని ఆయన ఎద్దేవా చేశారు.

డీఎంకే అంటే డయనాస్టీ, మనీ, కట్టపంచాయతీ అంటూ యెద్దేవా చేశారు. బీజేపీ వైజ్ఞానికపరంగా పరిశీలించి దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళుతోందని అన్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిం చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చెన్నై ర్యాలీలో జేపీ నడ్డా ప్రసంగిస్తూ శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. మంచిపనులు చేసేవారికి ఎలాంటి  ఇబ్బందులు వుండవని, తప్పిదాలకు పాల్పడేవారికి శిక్ష తప్పదని ఆ దిశగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో శుక్రవారం రాత్రి డీఎంకే సీనియర్‌ నేత, మాజీ శాసనసభ్యుడు ఏజీ సంపత్‌, ఆయన కుమారుడు ఇళయభారతి ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి, కో-ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా వుండగా చెన్నై ఫ్లవర్‌ బజార్‌ నుంచి మింట్‌ దాకా హార్బర్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓపెన్‌టాప్‌ వ్యాన్‌లో ర్యాలీగా బయల్దేరగా  దారిపొడవునా అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే తదితర మిత్రపక్షాలకు చెందిన కార్యకర్తలు వేల సంఖ్యలో ఇరువురికీ ఘనస్వాగతం పలికారు.