బెంగాల్ ఎన్నికలలో హింస …. బిజెపి కార్యకర్త హత్య

ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ తొలి ద‌శ ఎన్నిక‌ల్లో భాగంగా 30 నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  తొలి ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ‌లో అక్క‌డ‌క్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ప‌రిధిలోని కేశియారి ఏరియాలో బీజేపీ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. మృతుడిని మంగ‌ల్ సోరెన్(35)గా పోలీసులు గుర్తించారు

పుర్బా మేదినిపూర్ జిల్లాలోని స‌త్సాతామ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వ‌ద్ద గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు భ‌ద్ర‌తా సిబ్బందికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిద్ద‌రిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మరోవైపు తృణమూల్ పోలింగ్ బూత్‌లలో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేత సుబేందు అధికారి సోదరుడు సోమేందు అధికారి ప్రత్యర్థి తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. అధికార తృణమూల్ ఓటర్లను ప్రభావితం చేస్తోందని, బూత్ నెం. 149లో ఇదే జరిగితే తాము ఆపడానికి ప్రయత్నించామని తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయని, కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయించామని, అది చాలా చోట్ల జరిగే తంతేనని తెలిపారు. ఈ విషయంపై ఈసీ వెంటనే దృష్టి సారించాలని సోమేందు విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీకే చెందిన మరో అభ్యర్థి కూడా తృణమూల్‌పై ఆరోపణలు చేశారు.
మిడ్నాపూర్‌లోని పోలింగ్ బూత్‌లలోకి తృణమూల్ కార్యకర్తలు చొచ్చుకొచ్చి, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని బూత్‌లలో ఇబ్బందులు సృష్టించడానికి తృణమూల్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బూత్ నెంబర్ 266, 267లోకి అధికార తృణమూల్ కార్యకర్తలు చొచ్చుకొస్తున్నారని సమిత్ దాస్ మండిపడ్డారు.
 
‘‘అర్గోల్ పంచాయతీలో పోలింగ్ బూత్‌ దగ్గరికి వచ్చిన ఓటర్లను భయపెట్టడానికి తృణమూల్ ప్రయత్నిస్తోంది’’ అంటూ బీజేపీ నేత అనూప్ చక్రవర్తి మండిపడ్డారు. మరోవైపు ఉత్తరకాంతిలోని పోలింగ్ బూత్ నెంబర్ 178 దగ్గర బీజేపీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.
 
మరోవైపు అధికార తృణమూల్ బీజేపీపై విరుచుకుపడుతోంది. చాలా నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్‌లలో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పశ్చిమ మిడ్నాపూర్‌లోని 167 బూత్‌లోకి బీజేపీ నేతలు ప్రవేశించారని, ఓటర్లను రానివ్వడం లేదని, దీనికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని తృణమూల్ ఆరోపించింది. 
బెంగాల్‌లో 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉద‌యం 11 గంట‌ల‌కు 28.13 శాతం పోలింగ్ న‌మోదైంది. బెంగాల్‌లో తొలిదశ పోలింగ్‌ కోసం 7,061 పోలింగ్‌ స్టేషన్లు, 10,288 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేశారు.  73,80,942 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. అస్సాంలో 1,917 పోలింగ్‌ కేంద్రాల్లో 11,537 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 81.09 లక్షల మంది ఓటేయనున్నారు.