అస్సాంలో 100 సీట్లు గెలుస్తామ‌న్న సోనోవాల్‌

అస్సాంలో 100 సీట్లు గెలుస్తామ‌న్న సోనోవాల్‌
అస్సాం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ వంద క‌న్నా ఎక్క‌వ స్థానాల్లో గెల‌వ‌నున్న‌ట్లు  శ‌ర‌బానంద సోనోవాల్ ధీమా వ్యక్తం చేశారు.  అస్సాంలో మళ్ళీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్‌సీ)ల ప్రభావం తమపై ఉండదని ప్రజలు అర్థం చేసుకున్నారని, వారు మళ్ళీ బీజేపీకే పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

సోనోవాల్ శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, గడచిన ఐదేళ్ళలో అస్సామీల కోసం కృషి చేశామని, వారు సంతృప్తి చెందారని భరోసా వ్యక్తం చేశారు. అందరితో కలిసి, అందరి అభివృద్ధి కోసం, అందరి నమ్మకాన్ని చూరగొనడం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు. 

బీజేపీ, మిత్ర పక్షాలు క్షేత్ర స్థాయిలో కృషి చేస్తున్నందువల్ల ఈ శాసన సభ ఎన్నికల్లో గెలుపు తమదేనని తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్‌సీల ప్రభావం తమపై ఉండబోదని అస్సామీలు అర్థం చేసుకున్నారని తెలిపారు. 

అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించినపుడు సోనోవాల్ మాట్లాడుతూ, తాను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమేనని, ఈ ప్రశ్నను బీజేపీ పార్లమెంటరీ బోర్డును అడగాలని చెప్పారు. తాను కేవలం ‘బీజేపీ ప్రభుత్వం, మరోసారి’పై మాత్రమే దృష్టి సారించానని చెప్పారు. 

సర్బానంద్ సోనోవాల్ శనివారం జేపీ నగర్ నియోజకవర్గంలో ఓటు వేశారు. అంతకుముందు ఆయన డిబ్రుగఢ్‌లో బోగ బాబా మజార్‌లో ప్రార్థనలు చేశారు. తాను అందరూ ప్రశాంతంగా ఉండాలని, రాష్ట్రంలో బీజేపీ గెలవాలని కోరుకున్నట్లు చెప్పారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీ-యూపీపీఎల్ కలిసి పోటీ చేస్తున్నాయి.