ఉత్తర బెంగాల్ లో తిరుగులేని బిజెపి

*  ప్యూపిల్స్ పల్స్ సౌజన్యంతో 
ఉత్తర బెంగాల్ లో నాలుగు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో (డార్జీలింగ్, జల్పైగురి,అళిపురుడుర్స్ , కూచ్ బీహార్) గల 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఆ పార్టీకి తిరుగు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్యూపిల్స్ పల్స్ అంచనా ప్రకారం బిజెపి ఖచ్చితంగా 22 అసెంబ్లీ సీట్లు గెల్చుకుంటుంది. టిఎంసి  ఒక్క సీట్ కూడా ఖచ్చితంగా గెల్చుకొంటుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. 
 
మరో ఇది సీట్లలో టిఎంసి- బిజెపిల మధ్య గట్టి పోటీ నెలకొనగా, మరో సీట్ లో టిఎంసి – లెఫ్ట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు అత్యధికంగా ఉంటూ ఉండడంతో బిజెపికి సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాజకీయంగా ఎస్సిలలో రాజబంశిల ఆధిపత్యం కొనసాగుతూ ఉండగా, నమోశూద్రాలు, గోర్ఖలలోని ఒక వర్గం కూడా ఉన్నారు. వీరందరూ తృణమూల్ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. 
గత ఐదేళ్లుగా తృణమూల్ సాగించిన అణచివేత, రాజకీయ వేధింపులు, దౌర్జన్యాలు, స్థానిక నాయకుల అంతులేని అవినీతి కారణంగా వారంతా చెప్పుకోదగిన ఉనికి లేని బిజెపికి మద్దతు ఇస్తున్న  ధోరణులు కనిపిస్తున్నాయి. ఎస్టీ లలో కూడా అటువంటి ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. గిరిజనులలో నల్లవారు, తెల్లటి వారనే విభజన స్పష్టంగా ఉంది.
తేయాకు తోటలలో పనిచేసే సంథాల్, ముండా, ఒరన్ తదితర  తెగల వారు నల్లవారు కాగా, గోర్ఖాలతో పాటు రభస్ వంటి ఇతరులు తెల్లవారు. సంఖ్యాపరంగా నల్లవారు అధికంగా ఉన్నప్పటికీ, గతంలో వారి మధ్య రాజకీయంగా వైరుధ్యం కొనసాగినా 2019 నుండి మారిన పరిస్థితులలో వారంతా బిజెపి వైపు సమీకృతం అయిన్నట్లు ప్యూపిల్స్ పల్స్ పరిశోధన డైరెక్టర్ డా. సజ్జన్ కుమార్ తెలిపారు.
మిగిలిన జనాభాలో బెంగాలీ హిందువులు, హిందీ మాట్లాడే వారితో పాటు గుర్ఖాల లోని ఒక వర్గంలో గూడా తృణమూల్ వ్యతిరేక, బిజెపి అనుకూల ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గూర్ఖాలలో మంచి ప్రాబల్యం గల బిమల్ గురుంగ్ తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నప్పటికీ వారిలో ఇప్పుడు ఆయన ప్రభావం బాగా తగ్గిన్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రత్యేక గుర్ఖాల్యాండ్ ఏర్పాటుతో పాటు గురేఖలకు ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్ల కారణంగా వారిలో టిఎంసి పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది.
సుమారు 14 శాతంగా ఉన్న ముస్లింలు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కె మద్దతు తెలుపుతున్నారు. టిఎంసి స్థానిక నాయకత్వం దౌర్జన్యం, అవినీతి పట్ల ముస్లింలలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్నా ఓటర్లలో హిందూ – ముస్లిం విభజన కనిపిస్తూ ఉండడంతో వారంతా టిఎంసి వైపే మొగ్గు చూపుతున్నారు. ఒక నియోజకవర్గంలో మినహా ఈ ప్రాంతంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఉనికి కనిపించడం లేదు.
పాలనా యంత్రంగంలో క్రింది స్థాయిలో నెలకొన్న విశృంఖలంగా అవినీతి ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేక పవనాలకు దారితీస్తున్నది. చివరకు గ్రామీణ ఉపాధి హామీ పధకం అమలులో సహితం లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మైనారిటీలు సహితం ఈ విషయమై ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నప్పటికీ బిజెపి కీలక రాజకీయ శక్తిగా ఎదగడంతో వారిలో నెలకొన్న `అభద్రతా భావం’ కారణంగా వారిని తృణమూల్ నుండి దూరంగా వెళ్లకుండా చేస్తున్నది.
మమతా బనెర్జీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలలో కన్యశ్రీ, రూపశ్రీ, సాబూజ్ సాథ్ పధకాలు ప్రజలలో విశేష ప్రాచుర్యం పొందాయి. అయితే వీటి అమలులో కూడా అవినీతితో పాటు  రాజకీయంగా పక్షపాతం చూపుతున్నారనే విమర్శలున్నాయి. అందుకనే సంక్షేమ పధకాలు తృణమూల్ ప్రభుత్వాన్ని ఆదుకొనే సూచనలు కనిపించడం లేదు. అడుగంటిన ఉపాధి అవకాశాలు యువతలో అధికార పక్షం పట్ల ఆగ్రావేశాలకు దారితీస్తున్నాయి.
రాజకీయ హింస ప్రధానంగా అధికార పక్షం పట్ల హిందువులలో వ్యతిరేకతకు దారితీస్తుంది. గతంలో వామపక్ష ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హింసకు పాలపడితే, ప్రస్తుత ప్రభుత్వం సాధారణ ప్రజలను సహితం హింసకు గురిచేస్తున్నది.