కష్టసుఖాల్లో బంగ్లాదేశ్ కు తోడుగా భారత్

కష్టసుఖాల్లో తమకు అండగా ఉన్న భారత దేశానికి కృతజ్ఞతలు చెప్తున్నానని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తెలిపారు. శుక్రవారం బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పాల్గొంటూ  బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన పోరాటంలోనూ, తాజాగా కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనూ భారత దేశం తమకు గట్టి మద్దతునిచ్చిందని కొనియాడారు.

బంగ్లాదేశ్ సంతోషంగా ఉన్నపుడు, ఇబ్బందుల్లో ఉన్నపుడు భారత ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమె భరోసా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో బంగ్లాదేశీయుల కోసం 109 అంబులెన్స్‌లను భారత దేశం అందజేసిందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి, భారతీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.

 కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లను అందజేసి, భారత్ సహకరించిందని చెబుతూ భారత దేశం, బంగ్లాదేశ్ ఇరుగుపొరుగు దేశాలు మాత్రమే కాదని, ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక వారసత్వం ఉందని గుర్తు చేసుకున్నారు. భౌగోళిక సాన్నిహిత్యం కూడా ఉందని చెబుతూ 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు, ప్రభుత్వం మమేకమయ్యాయని తెలిపారు. 

ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాలకు ఒకే విధమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఉభయ దేశాలు ఉగ్రవాదం వంటి ఒకే తరహా ముప్పులను ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. ఇటువంటి అమానవీయ చర్యల వెనుక శక్తులు, ఆలోచనలు ఇంకా క్రియాశీలంగానే ఉన్నాయని హెచ్చరించారు. 

ఇటువంటి శక్తులను తిప్పికొట్టేందుకు సమైక్యంగా, అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు.  బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో నాటి భారత్ ప్రధాని ఇందిరా గాంధీ గొప్ప భూమికను పోషించారని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. 

 భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న బంధం రక్త సంబంధం అని ప్రధాని మోదీ అన్నారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఈ బంధం విడిపోదని చెప్పారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో బంగ్లాదేశీయుల రక్తంతోపాటు, భారత సైనికుల రక్తం కలిసి నేలపై పారిందని గుర్తుచేశారు.

‘బంగబంధు’ షేక్ ముజిబుర్ రహమాన్‌కు మరణానంతరం ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాన్ని ఆయన చిన్న కుమార్తె షేక్ రెహానాకు ఈ సందర్భంగా మోదీ అందజేశారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్‌ను గౌరవించడం భారతీయులకు గర్వకారణమని చెప్పారు. 

బంగ్లాదేశ్‌-భారత్ మధ్య సత్సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా ఆ దేశ యువతకు స్వర్ణ జయంతి ఉపకార వేతనాలను మోదీ ప్రకటించారు. బయాలజీ, కెమిస్ట్రీ, పర్యావరణ శాస్త్రం, ఇంజినీరింగ్, గణితం, మెడిసిన్, భౌతిక శాస్త్రాలలో పరిశోధన చేసినవారికి ఈ ఉపకార వేతనాలను ఇస్తామని చెప్పారు.

 కాగా, భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలకు 50 ఏండ్లు గడిచిన సందర్భంగా బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలను మోదీ భారత్ కు ప్రధాని ఆహ్వానించారు. వారిని స్టార్టప్‌ ఇండియాలో భాగస్వాములు కావాలని కోరారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులకు ఇచ్చే స్వర్ణజయంతి ఫెల్లోషిప్‌ను బంగ్లాదేశ్‌ యువతకు కూడా ఇస్తామని పేర్కొన్నారు.

మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు 

 ‘బంగబంధు’ ముజిబుర్ రహమాన్ బంగ్లాదేశ్‌కు చేసిన సేవలను మోదీ ప్రస్తావించినపుడు, బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన యోధుల పేర్లను చెప్పినపుడు, ప్రజాస్వామ్యమే ఇరు దేశాల బలమని చెప్పినపుడు, పాకిస్థాన్‌ను పరోక్షంగా ఎండగట్టినపుడు, ప్రపంచంలోని ఏ శక్తీ బంగ్లాదేశ్‌ను బానిసను చేయజాలదని చెప్పినపుడు ఆహూతులంతా సంతోషంతో చప్పట్లు చరుస్తూ మోదీని అభినందించారు. 

అయితే, మోదీ పర్యటనకు నిరసనగా బాంగ్లాదేశ్ లో  కొందరు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు.  చిట్టగాంగ్‌ నగరంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు.