రాజన్న రాజ్యం కాదు.. రామరాజ్యం 

తెలంగాణ యాస కోసం‌ షర్మిల తిప్పలు పడుతున్నారని దిగవంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెను బిజెపి ఎంపీ డి అరవింద్ ఎద్దేవా చేశారు.   ‘‘నిజామాబాద్ జిల్లాకు ప‌సుపు బోర్డు తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌రో ఇచ్చారంట‌… బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశారట’’ అంటూ తన పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలను కొట్టిపారవేసారు.    

తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కాదు.. రామరాజ్యం కోరుకుంటున్నారని అరవింద్ స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కూతురు అయినంత మాత్రాన వైఎస్‌ఆర్‌ కాలేరని అంటూ ఆమె `తెలంగాణ పార్టీ’ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను అపహాస్యం చేశారు.

ఏపీ రైతులు నిజామాబాద్‌లో పసుపు పంట అమ్ముకుంటున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఆమె అన్న, ఏపీ  సీఎం జగన్ ఇచ్చే ధర కంటే తాము పసుపు రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నామని అరవింద్ స్పష్టం చేశారు.  పసుపు రైతుల కోసం కేంద్రం స్పైసెస్ ఎక్స్‌టెన్షన్‌ బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్త చేశారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచిందని ప్రకటించారు. పసుపు రైతుల కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో పది కోట్ల రూపాయలు పెంచుతున్నామని, వారికి మద్దతు ధరకు మించిన రేటునే ఇస్తున్నామని వెల్లడించారు. క్వాలిటీ పసుపు పదివేలకు పైగానే ధర పలుకుతోందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌లు రైతులకు రుణ మాఫీ చేస్తామని అన్యాయం చేస్తున్నారని, నిరుద్యోగ  భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక నాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.