మళ్ళి కరోనా విధింపబోమని కేసీఆర్ భరోసా!

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి ఉధృత రూపం దాల్చడంతో పలు రాస్త్రాలలో తిరిగి లాక్ డౌన్ పెడుతూ ఉండడంతో తెలంగాణలో అటువంటి పరిస్థితి ఏర్పడబోదని అంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు భరోసా ఇచ్చారు. 

ప్రజలు ఆందోళన చెందవద్దని… రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టమని రాష్ట్ర శాసనసభలో  తేల్చిచెప్పారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్లు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా నష్టపోయామని తెలిపారు. కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయ్యిందని చెబుతూ,  పరిశ్రమల మూతవేత ఉండదని స్పష్టం చేశారు. తక్కువ మంది అతిథుల మధ్యే శుభకార్యాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. 

కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ  వ్యాక్సిన్ డోసుల్లో మనవాటా మనకు వస్తుందని తెలిపారు. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా టెస్ట్‌లు చేసినట్లు చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే అని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు 10లక్షల మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ఇ‍చ్చామని తెలిపారు. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆదేశించారు. స్వీయక్రమశిక్షణతోనే కరోనాను నియంత్రించగలమని సీఎం కేసీఆర్ అన్నారు.