బెంగాల్ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు 

బెంగాల్ ప్రజలు మార్పు కొంటున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపు ఖాయంగా కనిపిస్తున్నదని, ఎన్నికల అనంతరం ఏర్పడయ్యెడిది బిజెపి ప్రభుత్వమే అని సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రారంభించిన తన రోడ్ షో లలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
 
‘ఇవాల చేపట్టిన రోడ్‌షోలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రజల భావోద్వేగం పశ్చి మ బెంగాల్‌లో మార్పును కోరుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనం’ అని కేషియరీలో మీడియాతో మాట్లాడుతూ మిథున్‌ చక్కవర్తి చెప్పారు. గురువారం జంగిల్ మహల్ ప్రాంతంలో రెండు మెగా రోడ్‌షోలకు నాయకత్వం వహించారు.

మెడకు పొడవాటి కాషాయం కండువా చుట్టుకొని తెల్ల కుర్తా ధరించి మిథున్‌ చక్రవర్తి రోడ్‌షోలలో పాల్గొన్నారు. బంకురాలోని సాల్టోరాలో, పశ్చిమ్ మేధినీపూర్ జిల్లాలోని కేషియరీలో మిథున్‌ రోడ్‌షోలు నిర్వహించారు. మిథున్‌ పాల్గొన్న దారి వెంట ‘జై శ్రీ రామ్’ నినాదాలు మార్మోగాయి. బంతి పువ్వులతో అలంకరించబడిన ఎంయువీపై నిలబడిన మిథున్‌ దాదాపు రెండున్నర గంటలకు పైగా ఉత్సాహంగా మద్దతుదారులను పలకరించారు. తమ అభిమాన నటుడుని దగ్గరగా చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇళ్ళపై నుంచి చేతులు ఊపుతూ మిథున్‌ దాదా అంటూ పలకరించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే మీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అని అడగ్గా.. ‘మీరు కూడా ఇదే ప్రశ్నతో మత్తులో ఉన్నారు’ అంటూ చిరునవ్వు నవ్వారు.  ‘నేను హీరోను కాదు. నేను వారి మిథున్ దా. వారు నా స్నేహితులు. నాకు బెంగాల్ ప్రజలతో సంబంధం ఉన్నది’ అని స్పష్టం చేశారు. 

రోడ్‌షోల్లో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు సాల్టోరాకు మిథున్‌ చక్రవర్తి చేరుకున్నారు. అయితే, సూపర్ స్టార్‌ను చూసేందుకు హెలిప్యాడ్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో కనీసం 15 నిమిషాలు హెలికాప్టర్ నుంచి దిగలేకపోయాడు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా ర్యాలీ సందర్భంగా మిథున్‌ చక్రవర్తి బీజేపీలో చేరడం తెలిసిందే.