రానున్న దశాబ్దంలో వృద్ధి వేగవంతం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న సంస్కరణలు రానున్న దశాబ్దంలో సత్ఫలితాలిస్తాయని నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ భరోసా వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా కోరుకుంటున్న సంస్కరణలను ఈ ప్రభుత్వం అమలు చేస్తోందని కొనియాడారు. 

టైమ్స్ నెట్‌వర్క్ నిర్వహించిన ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్, 2021లో  ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వృద్ధి చెందడం భారత దేశం ముందు ఉన్న నిజమైన సవాలు అని అమితాబ్ కాంత్ చెప్పారు. 1991లో భారీ సంస్కరణలు జరిగాయని, ఆ తర్వాత అంతగా సంస్కరణలు జరగలేదని పేర్కొన్నారు. అయితే కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎంతో కాలంగా కోరుతున్న స్ట్రక్చరల్ రిఫార్మ్‌స్ జరిగాయని చెప్పారు.

గనులు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు వంటి రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఎంతో కాలంగా కోరుతున్న సంస్కరణలను కోవిడ్ మహమ్మారి తర్వాత అమల్లోకి తీసుకొచ్చారని, ఆర్థిక వ్యవస్థ కోలుకునే తీరు ఆంగ్ల అక్షరం ‘వీ’ రూపంలో ఉందని చెప్పారు. రానున్న దశాబ్దంలో వృద్ధి కనిపిస్తుందని చెప్పారు. ఇటీవలి సంస్కరణలు కేవలం వచ్చే ఏడాదిలో మాత్రమే కాకుండా రానున్న దశాబ్దంలో వృద్ధి వేగాన్ని పెంచుతాయని చెప్పారు.

ఇలా ఉండగా, విశాఖ ఉక్కు సహా పీఎస్‌యూల అమ్మకంపై కొన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా  ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని బిగ్‌బుల్‌ రాకేష్‌ జంఝన్‌వాలా చెప్పుకొచ్చారు. దేశం రెండంకెల వృద్ధి రేటు సాధించాలంటే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించక తప్పదని స్పష్టం చేశారు. 

జన్‌థన్‌ ఖాతాలు, డిజిటలీకరణతో ప్రభుత్వాలు సులభతర వాణిజ్యానికి బాటలు వేశాయని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా రెండో దశ సంస్కరణలపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని రాకేష్ జంఝన్‌వాలా స్పష్టం చేశారు. 

మనం రెండంకెల వృద్ధి సాధించాలంటే పీఎస్‌యూల ప్రైవేటీకరణ అనివార్యమని ఓ జాతీయ వార్తా ఛానెల్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటా ఉపసంహరణ సమయంలో ఆయా వాటాలను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లు కంపెనీలు కోలుకుని సత్తా చాటేవరకూ కనీసం మూడు నాలుగేండ్లు వేచిచూడాలని సూచించారు.

2003 నుంచి 2008 మధ్య ప్రభుత్వ రంగం మెరుగైన సామర్థ్యం కనబరిచినా ఇటీవల కాలంలో పేలవమైన సామర్ధ్యం కనబరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లపై తాను సానుకూల దృక్పథంతో ఉన్నాయని, అవి రాబోయే రోజుల్లో భారీగా లాభపడతాయని విశ్లేషించారు. రాబోయే ఐదు నుంచి పదేండ్లలో కొన్ని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు కొన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.