మగవారి కోసం ఉద్దేశించిన సమాజం… `సుప్రీం’ ఎద్దేవా 

మన సమాజ నిర్మాణం మగవారి కోసం.. మగవారిచే సృష్టించబడిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలని సుప్రీంకోర్టు ఎద్దేవా చేసింది. సైన్యంలో శాశ్వత కమిషన్‌ కోసం సుమారు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు తీవ్రమైన ఈ వ్యాఖ్యలు చేసింది.

సైన్యంలో  మహిళలకు శాశ్వత కమిషన్‌ పొందడానికి నిర్దేశించిన మెడికల్‌ ఫిట్‌నెస్‌ పద్ధతి ఏకపక్షంగా.. అహేతుకంగా, వివక్షాపూరితంగా ఉందని పేర్కొంది. గతేడాది సుప్రీంకోర్టు తీర్పు మేరకు రక్షణ శాఖ మహిళలకు సైన్యంలో  శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మహిళలకు శాశ్వత కమిషన్‌ మంజూరు చేసే ఆర్మీ ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి  వ్యక్తం చేసింది. సైన్యం సెలెక్టివ్‌ యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌ (ఎస్‌సీఏఆర్‌) మూల్యాంకనం ఆలస్యం చేయడం, మెడికల్‌ ఫిట్‌నెస్‌ క్రైటిరియాను అమలు చేయడం అనేది మహిళా అధికారులపై వివక్ష చూపుతుందని జస్టిస్‌ డివై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

షేప్-1 క్రైటీరియాగా భావిస్తున్న‌ శారీర‌క ప్ర‌మాణాలు కేవ‌లం మ‌గ‌ ఆఫీస‌ర్లకు మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌ని, ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇచ్చిన తొలి రోజుల్లో ఆ ప్ర‌మాణాల‌ను పాటించిన‌ట్లు సుప్రీంకోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది. పురుషుల‌కు అమ‌లు అవుతున్న షేప్‌-1 ఫిట్‌నెస్ ప్ర‌మాణాలు మ‌హిళ‌ల‌కు వ‌ర్తించ‌వు అని, ఆ ప్ర‌మాణాలు మ‌హిళ‌ల్లో ఆశించ‌డం అసంబ‌ద్ద‌మ‌ని కోర్టు చెప్పింది. షేప్‌-1 క్రైటీరియా ఏక‌ప‌క్షంగా ఉంద‌ని, దాంట్లో వివ‌క్ష ఉన్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది.

క్ర‌మ‌శిక్ష‌ణ‌, విజిలెన్స్ క్లియ‌రెన్స్ ఆధారంగా మ‌హిళా ఆఫీస‌ర్ల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. కోర్టు ముందుకు వచ్చిన అనేక మంది మహిళా అధికారులు అనేక అవార్డులు గెలుచుకున్నారని, చాలామంది విదేశీ కార్యకలపాల అంశంలో బాగా పనిచేశారని గుర్తు చేశారు.

అయితే క్రీడా పోటీలలో రాణించిన వారిని విస్మరించినట్లు తాము గుర్తించామని ఆయన విచారం వ్యక్తం చేశారు. మహిళలు సాధించిన విజయాల వివరణాత్మక లిస్టు తీర్పులో ఇవ్వబడిందని అయితే బోర్డు ఎంపికకోసం కాకుండా తిరస్కరణ కోసం కూర్చున్నట్లు ఉందని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.