100 రోజుల పాటు కరోనా సెకండ్‌ వేవ్‌ 

దేశంలో ఫిబ్రవరి నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తాజా నివేదికలో వెల్లడించింది. భారత్‌లో కరోనా రెండో దశ ప్రవేశించిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 

 ‘సెకండ్‌ వేవ్‌ ఫిబ్రవరి 15 నుంచి 100 రోజులు ఉండనుందనీ.. దీంతో రానున్న ఏప్రిల్‌ మధ్యనాటికి దేశవ్యాప్తంగా వైరస్‌ తీవ్రరూపం దాల్చనుందని.. దాదాపు 25 లక్షల మంది రెండో దశలో కరోనా బారిన పడే అవకాశం ఉంది’ అని ఎస్‌బిఐ నివేదిక అంచనా వేసింది.

 ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య తారస్థాయికి చేరవచ్చునని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం కరోనా కట్టడికి అంతగా ప్రభావం చూపకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది.  ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్‌ కేసుల వల్ల కొన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా క్షీణించాయి.

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో.. మరిన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఒక్కటే సరైన మార్గంలా కనిపిస్తోందని ఎస్‌బిఐ పేర్కొంది. కోవిడ్ మహమ్మారి విసిరే సవాలును మరింత మెరుగ్గా ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 34 లక్షల డోసులనే పంపిణీ చేస్తున్నారు. వీటిని రోజుకి 40 నుంచి 45 లోలు పెంచినప్పటికీ 45 ఏళ్లకు పైన వారందరికీ టీకా అందించడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎస్‌బిఐ నివేదిక అంచనా వేసింది.

ఇలా ఉండగా, భారతదేశంలోని ప్రముఖ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఒకటైన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తన సీఎస్‌ఆర్‌ చర్యల్లో భాగంగా కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు చేయూత అందించాలని నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలోని తక్కువ ఆదాయ వర్గాలకు రెండు పర్యాయాల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఖరీదును భరించనుంది. 

నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ చర్య ద్వారా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌, రాయగఢ్‌, పాల్ఘార్‌, జల్గావ్‌, లాతూర్‌. అహ్మద్‌నగర్‌, యవత్‌మాల్‌, చంద్రాపూర్‌ ఉపజిల్లాలు, ముంబైశివారు ప్రాంతాలు, పుణె శివారు ప్రాంతాలు, నాగ్‌పూర్‌ శివారు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి (విజయవాడ ప్రాంతం)లో సీనియర్‌ సిటిజన్లు, ఇతర అనారోగ్యాలు కలిగిన 37,000 మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.