బాంబే హైకోర్టుకు పరంబీర్‌ సింగ్‌

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్‌ చీఫ్‌ పరంబీర్‌ సింగ్‌ గురువారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పారిశ్రామిక వేత్త ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద బాంబులతో ఉన్న వాహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్‌ అధికారి సచిన్‌ వాజేను హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వంద కోట్లు వసూలు చేయమని అడిగినట్లు పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు

దీనిపై సీబీఐ దర్యాప్తుతోపాటు తన బదిలీని సవాల్‌ చేస్తూ పరంబీర్‌ సింగ్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఆయన పిటిషన్‌ను బుధవారం తిరస్కరించింది. ఆరోపణలు తీవ్రమైనవేనని పేర్కొన్న సుప్రీంకోర్టు దీనిపై బాంబే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. 

ఈ నేపథ్యంలో పరంబీర్‌ సింగ్‌ గురువారం అనిల్‌ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అవినీతి ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు.

 మరోవంక, ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు ప‌దార్ధాలతో ఉన్న వాహ‌నాన్ని నిలిపిన ఘ‌ట‌న‌లో స‌స్పెష‌న్‌కు గురైన ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వాజే ఇంటి నుంచి 62 బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం స‌చిన్ వాజే ఎన్ఐఏ ఆధీనంలోనే ఉన్నాడు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ కోసం నిందితుడు వాజేను క‌స్ట‌డీలోకి తీసుకునేందుకు కోర్టులో ఎన్ఐఏ పిటిష‌న్ వేసింది. 

స‌చిన్ వాజే ఇంట్లో 62 బుల్లెట్లు ల‌భ్యం అయ్యాయ‌ని, వాటికి అధికారిక లెక్క లేద‌ని, స‌ర్వీస్ రివాల్వ‌ర్ కోసం ఇచ్చిన 30 బుల్లెట్ల‌లో అత‌ని వ‌ద్ద కేవ‌లం 5 బుల్లెట్లు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని, అయితే మిగితా బుల్లెట్లు ఎక్క‌డ ఉన్నాయో నిందితుడు చెప్ప‌డం లేద‌ని ఎన్ఐఏ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది.