కరోనా కట్టడి చర్యల్లో కేసీఆర్ సర్కార్ విఫలం

కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ సర్కార్‌ తీరును ఎండగట్టారు. తెలంగాణ సర్కారు ఏ పని చేసినా అరకొరగానే ఉంటుందనడానికి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్ని చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. 

విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారని, కానీ, మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారన్నది గమనిస్తే శూన్యమని ఆమె  విమర్శించారు.

సూర్యాపేటలో సోమవారం జరిగిన కబడ్డీ పోటీల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిర్వహణ తీరు చూస్తే ప్రధానంగా రెండు తప్పులను అందరూ ఎత్తి చూపుతున్నారని ఆమె తెలిపారు. 

ఇక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదని, గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఒక్క చోటే కాదు, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కోవిడ్ కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని విజయశాంతి ధ్వజమెత్తారు. 

అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితి అదుపు తప్పకుండా చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె దయ్యబట్టారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ సర్కారు మేలుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.