తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత, విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు.
పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఆ తర్వాత మంత్రి సబిత శాసనసభలో ప్రకటన చేశారు. దేశంలో మరో మారు కరోనా వ్యాప్తి చెందుతుంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మనరాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుముదురుగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని ఆమె తెలిపారు.
విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, పంజాబ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌తో పాటు తదితర రాష్ర్టాలు విద్యాసంస్థలు బంద్ చేశాయని ఆమె వివరించారు.
మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి చెప్పారు.
ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు బంద్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సబితా రెడ్డి వెల్లడించారు.
కాగా, ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించిన్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయని చెప్పారు.
విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
ఎస్డిఎఫ్ నిధులతోపాటు ఖమ్మంకు అదనంగా సాయం
నివాసముంటున్న ఇళ్లు కూల్చం