ఆగస్టు నాటికి 470 మిలియన్‌ డోసుల సరఫరా

 సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ నుంచి కొవిడ్ -19 వ్యాక్సిన్ల సరఫరా జూలై-ఆగస్టు నాటికి పెరిగే అవకాశం ఉన్నదని నితీ ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ చెప్పారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నెలకు 60 మిలియన్ మోతాదులను తయారు చేస్తుందని, వచ్చే ఆగస్టు నాటికి 470 మిలియన్ మోతాదులను సరఫరా చేసే స్థితిలో ఉంటుందని వీకే పాల్‌ తెలిపారు. నిన్న ఒక్క రోజే మూడు మిలియన్ల మందికి టీకాలు వేయగలిగామని, ట్రాక్‌లో ఉన్నామని తెలిపారు.

భారతదేశంలో కొవిడ్-19 పై సన్ ఫార్మా సైన్స్ ఫౌండేషన్ ఆన్‌లైన్ వార్షిక సమావేశంలో కొవిడ్-19 టీకా కార్యక్రమం, తయారీ సంస్థల్లో ఉత్పత్తి సామర్థ్యం, భారతదేశం లక్ష్యాలను చేరుతుందా? అనే ప్రశ్నలకు పాల్ సమాధానమిచ్చారు. ఈ సమావేశాన్ని హర్యానా సోనెపట్‌లో ఉన్న అశోక విశ్వవిద్యాలయంకు చెందిన త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ షాహిద్ జమీల్ కోఆర్డినేట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు వేయడం 5 కోట్లకు చేరుకుంటుందని.. 2 కోట్లకు పైగా లబ్ధిదారులు 60 ఏండ్ల వయసు పైబడిన వారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. కోవిషీల్డ్‌-కోవాక్సిన్ యొక్క వాడకంపై అడిగిన ప్రశ్నకు పాల్ సమాధానమిస్తూ.. ఈ అసమానత ప్రధానంగా సరఫరా సమస్యకు సంబంధించినదన్నారు. కోవాక్సిన్ తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉన్నదని ఆయన చెప్పారు.

‘ఎస్ఐ‌ఐ, భారత్ బయోటెక్ రెండూ పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రెండూ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. టీకాల్లో క్రమబద్ధమైన పెరుగుదల ఉండాలి. భారత్ బయోటెక్ కూడా ఆగస్టు నాటికి 120-130 మిలియన్ మోతాదుల కోవాక్సిన్ సరఫరా జరగాలి’ అని పాల్‌ పేర్కొన్నారు.