మోదీ 115 స్కీంలు తెస్తే.. మమతా 115 స్కాంలు చేశారు

దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 115 స్కీంలు తెగా.. పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ 115 స్కాంలు చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. మమత పాలనలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని దుయ్యబట్టారు.

మమత మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల సంఖ్య మరింత పెరగడం ఖాయమని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌షా మంగళవారం నాడు గోసబాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు.  అంతకుముందు అమరవీరుల దినం సందర్భంగా భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులకు అమిత్‌షా నివాళులు అర్పించారు.సుందర్బన్ ప్రాంతంలో ఆంఫన్ తుపాను బాధితులకు కేంద్రం విడుదల చేసిన నిధులను ‘‘మాయం చేశారంటూ’’ ఆయన విరుచుకుపడ్డారు.

 ‘‘నిధులు నొక్కేయడం అధికార తృణమూల్ కాంగ్రెస్ సంస్కృతి. భాటిజా (మేనల్లుడు), ఆయన పరివారం కలిసి ఆంఫన్ బాధితుల పరిహారం కోసం కేంద్రం పంపిన నిధులను మాయం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తుఫాను సహాయక నిధుల దారిమళ్లింపుపై విచారణ కోసం ఓ కమిటీని వేస్తాం. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్టు తేలిన అందర్నీ జైలుకు పంపిస్తాం…’’ అని షా  స్పష్టం చేశారు. 

తుఫాను బాధితుల పరిహారం కోసం కేంద్రం నిధులను పంపితే.. టీఎంసీ నేతలు వాటిని బాధితులకు చేరకుండా పక్కదారి మళ్లించారని ఆయన ఆరోపించారు. ‘‘ఆంఫన్ తుపాను బాధితుల పరిహారం కోసం కేంద్రం రూ.10 వేల కోట్లు పంపించింది. అందులో ఒక్క పైసా అయినా మీకు అందిందా? ఆ డబ్బంతా ఏమైంది?’’ అని షా ప్రశ్నించారు.

సామాన్యుడి అభివృద్ధి కంటే ఆమె మేనల్లుడి సంక్షేమం కోసమే మమతా బెనర్జీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ‘‘కేవలం తన మేనల్లుడి ముఖ్యమంత్రిని చేయడం కోసమే మమతా బెనర్జీ పనిచేస్తున్నారు. ఆమె మేనల్లుడు ముఖ్యమంత్రిగా మీకు కావాలా? అక్కర్లేదు అనుకుంటే మీరు బీజేపీకి ఓటువేయండి..’’ అని ఆయన కోరారు. 

అధికార టీఎంసీ ‘‘గూండాలు, సిండికేట్ ముఠా’’ల ఆటకట్టించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ‘‘మమత సిండికేట్ పాలనకు చెక్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ సంస్కృతికి మనం ముగింపు పలకాలి..’’ అని షా పిలుపిచ్చారు. 

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలనే దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టగానే సీఏఏను అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి తెలిపారు.  బెంగాల్‌ ప్రాంతం అంతా అవినీతి, ఆశ్రితపక్షపాతంతో నిండిపోయిందని విచారం వ్యక్తం చేశారు. తమకు అధికారం అప్పగిస్తే రెండేండ్లలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు.

మమతా తానుచ్చిన 282 హామీల్లో 82 కూడా తీర్చలేకపోయారని, తాము అధికారంలోకి రాగానే సుందర్‌బన్‌ జిల్లా ఏర్పాటుచేస్తామని అమిత్ షా  ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మేధినీపూర్‌ నిర్వహిస్తున్న ర్యాలీలో నడ్డా పాల్గొంటారు.