మహారాష్ట్ర పోలీస్ బదిలీ పోస్టింగ్ రాకెట్ బైటపెడతా!

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు రెండు రోజులుగా కొత్త మలుపు తీసుకుంది. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నెలకు రూ.వంద కోట్లు వసూల్‌ లక్క్ష్యంగా పెట్టుకున్నారని  మాజీ పోలీస్‌ కమీషనర్ ఆరోపించడమే కాకుండా తన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్ట్ కు వెళ్లడంతో మహారాష్ట్రంలో అధికారమలో ఉన్న మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం తీవ్ర కుదుపులకు గురవుతున్నది. 
 
ఆరోపణలు తీవ్రమైనవని, ముఖ్యమంత్రి తగిన దర్యాప్తు జరిపించాలని మొదట చెప్పుకొచ్చిన ఎన్సీపీ అధినేత శరద్ పవర్ మరుసటి రోజే మాటమార్చి  అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అంటూ వెనుకేసుకొచ్చారు. దానితో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు దిక్కు తోచడం లేదు.
 
హోంమంత్రిని కాపాడుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం  తన గొయ్యి తానే తవ్వుకుందని  మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంవీఏ సర్కార్ బండారం బయటపెడతామని ప్రకటించడంతో అధికార పక్షంలో ప్రకంపనలు చోటుచేసుకొంటున్నాయి. 
‘‘మహారాష్ట్ర పోలీస్ శాఖలో ఐపీఎస్, నాన్ ఐపీఎస్ అధికారుల బదిలీ పోస్టింగ్ రాకెట్‌కి సంబంధించిన కీలక పత్రాలు, కాల్ రికార్డింగులు మా వద్ద ఉన్నాయి. ఈ డేటాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి, కేంద్ర హోంశాఖ సెక్రటరీకి అందజేస్తాం..’’ అని ఫడ్నవిస్ వెల్లడించారు. బదిలీ రాకెట్’’‌కి సంబంధించి తన వద్ద మొత్తం 6.3 జీబీ డేటా ఉందని ఆయన చెప్పకొచ్చారు.
‘‘పోలీస్ అధికారుల బదిలీ రాకెట్‌‌కి సంబంధించి అనుమానితుల కాల్ రికార్డులను ఆగస్టు 20న ఇంటిలిజెన్స్ కమిషనర్ మహారాష్ట్ర డీజీపీకి పంపించారు. తర్వాత వాటిని సీఎంకి పంపించారు. వీటిపై ఆయన కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ అడ్డుకున్నారు..’’ అని ఫడ్నవిస్ ఆరోపించారు.
ఫిబ్రవరి ద్వితీయార్థంలో తాను కరోనా వల్ల ఐసొలేషన్‌లో ఉన్నానంటూ అనిల్ దేశ్‌ముఖ్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధమని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. వీఐపీ కదలికలపై పోలీసుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం…  హోంమంత్రి ఫిబ్రవరి 17న సహ్యాద్రి గెస్ట్ హౌస్‌కి, ఫిబ్రవరి 24న మంత్రాలయానికి వెళ్లారని ఆయన పేర్కొన్నారు.
‘‘ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉన్నప్పటికీ.. అధికారులను కలుస్తూనే ఉన్నారు. ఆయన ఐసోలేషన్‌లో లేరు. పవార్ గారు నిన్న ఆయనకు సరిగ్గా చెప్పలేదనుకుంటా..’’ అంటూ ఎద్దేవా చేశారు. కొవిడ్ కారణంగా ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు హోంమంత్రి దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో ఉన్నారంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిన్న కొన్ని ఆస్పత్రి పత్రాలను చూపించారు.
మరోవంక మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే తనపై యాసిడ్‌ పోస్తానని.. జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆ ఆరోపణలను ఖండించిన సావంత్ ఆ సమయంలో పక్కన ఎవరున్నారో చెప్పమని సవాల్ చేశారు. 
అయితే, సావంత్ బెదిరించినప్పుడు నవనీత్ కౌర్ పక్కన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నట్లు న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది. ‘పోలీసులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి ముందు శివసేన పేరుతో బెదిరింపులు లేఖలు వచ్చాయని కూడా ఆమె ఆరోపించారు.
అంతేకాక ‘‘ఉద్ధవ్ థాకరే గురించి మాట్లాడుతున్నావ్‌ కదా.. నీకు అందమైన ముఖం ఉందని మురిసిపోతున్నావు.. దానిపై యాసిడ్ పోస్తే ఎక్కడకీ తిరగలేవు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లు చేశారు’ అని నవనీత్ ఆరోపించారు.