కాంగ్రెస్ అస్సామీలను వెర్రివాళ్లను చేస్తోంది

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సకాలంలో అస్సాంలో అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుపై కాంగ్రెస్ అస్సామీలను వెర్రివాళ్ళను చేస్తోందని మండిపడ్డారు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. 

అస్సాం శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన మంగళవారం విడుదల చేస్తూ సీఏఏను పార్లమెంటు ఆమోదించిందని జేపీ నడ్డా గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే, ఈ చట్టాన్ని అస్సాంలో అమలు కానీయబోమంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని విస్మయం వ్యక్తం చేశారు.

ఇటువంటి ప్రచారానికి కారణం కాంగ్రెస్ అజ్ఞానమైనా కావచ్చునని, లేదంటే రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్ళను చేయాలనే ప్రయత్నమైనా కావచ్చునని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆలోచనా ధోరణి గురించి తాను మాట్లాడదలచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ వైఖరి సమస్యాత్మకమైనదే కాకుండా రాష్ట్రానికి కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.

అస్సాం గుర్తింపు వైష్ణవ స్వామీజీ శ్రీమంత శంకరదేవ, ‘భారత రత్న’ డాక్టర్ భూపేన్ హజారికా, ‘భారత రత్న’ గోపీనాథ్ బొర్డోలోయ్ వంటివారితో ముడిపడినదని చెప్పారు. దీనిని ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్‌తో ముడిపెట్టగలమా? అని ప్రశ్నించారు. అస్సాం గుర్తింపును, సంస్కృతిని పరిరక్షించడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 

సీఏఏ ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన హింసను తట్టుకోలేక భారత దేశానికి వలస వచ్చినవారికి భారతీయ పౌరసత్వం ఇవ్వవచ్చు. 2014 డిసెంబరు 31న లేదా అంతకు ముందు మన దేశానికి వలస వచ్చి, కనీసం ఐదేళ్ళు నివసించినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 

కాగా, అక్రమ వలసలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. బీజేపీకి మరోసారి అధికారమిస్తే బంగ్లాదేశ్ నుంచి అసోంకి అక్రమ వలసలు చోటుచేసుకోకుండా అడ్డుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. 

ఇవాళ అస్సాంలోని లుంబ్డింగ్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచారం సభలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ  ‘‘పొరుగుదేశం నుంచి అక్రమ వలసలను అడ్డకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేసింది. అస్సామీ సంస్కృతి, గుర్తింపును పరిరక్షిస్తాం. మాకు ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే డాక్టర్ భూపెన్ హజారికాకి భారత రత్న ఇచ్చేవాళ్లం కాదు..’’ అని పేర్కొన్నారు. 

నిత్యం వరదల కారణం ఎదురవుతున్న సమస్యలపైనా రాజ్‌నాథ్ స్పందించారు. బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే  దీన్ని పరిష్కరించేందుకు శక్తిమేర కృషిచేస్తామని హామీ ఇచ్చారు.