సాంకేతిక పరిజ్ఞానంలో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు (స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సీఆర్‌బీ–నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో/కేంద్ర హోంశాఖ) గుర్తించి అవార్డులను ప్రకటించడం విశేషం. 

అత్యుత్తమ పోలీసింగ్‌లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక.. ఏపీ పోలీసు శాఖ మొత్తం 125 జాతీయ అవార్డులను దక్కించుకోగా,  ఈ ఏడాదే 17 అవార్డులను అందుకుంది. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కే దక్కింది. 

స్మార్ట్‌ ఇన్నోవేటివ్‌ పోలీసింగ్‌ స్టేట్‌ 

ఆపత్కాలంలో పౌరులకు అందించే సేవలలో ఏపీ పోలీస్‌ శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) ఈ అవార్డును ప్రకటించింది. పోలీసుల సామర్థ్యం పెంచేందుకు పూర్తిగా డిజిటలైజ్‌ చేయడంలో అత్యంత ప్రతిభ కనపరిచినందుకు రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు దక్కింది. 

ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 
దేశంలోనే తొలిసారిగా అత్యంత వేగంగా 85శాతం కేసుల దర్యాప్తును పూర్తిచేసినందుకు ఈ అవార్డును గెలుచుకుంది. కేసుల దర్యాప్తులో సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించడంలో ఏపీ పోలీసులు అద్భుత పనితీరు కనబరిచారు. అలాగే, ఎలాంటి రుసుము లేకుండా 87 సేవలతో కూడిన ఏపీ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ను పౌరులకు అందుబాటులో ఉంచింది.  

దిశా పోలీస్‌స్టేషన్లు  
మహిళలకు సత్వర న్యాయం అందించడంతో పాటు కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేయడమే కాక.. సంవత్సర కాల వ్యవధిలోనే 1,551 కేసులలో సత్వర చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలోని 13లక్షల మంది మహిళలు దిశ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘దిశ’ కేసుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు, ప్రతి జిల్లాలో స్పెషల్‌ కోర్టులను ఏర్పాటుచేయడంతో జాతీయ స్థాయి అవార్డు లభించింది.  

మహిళలకు హెల్ప్‌ డెస్క్‌ 
దిశ పోలీస్‌స్టేషన్లలో ‘ఉమెన్‌ హెల్ప్‌ డెస్‌్క’లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక్కడ మంచినీటి సౌకర్యం, విశ్రాంతి గది, విశాలమైన రిసెప్షన్‌ సెంటర్, నిరక్షరాస్యులైన మహిళల కోసం ఫిర్యాదు రాయడానికి సిబ్బందిని నియమించారు. అదనంగా మహిళా మిత్ర వలంటీర్లు కూడా తమ సేవలను అందిస్తారు. వీటికి గుర్తింపుగా జాతీయ స్థాయి సిల్వర్‌ అవార్డు వచ్చింది. 

సైబర్‌ మిత్ర 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్జాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన సైబర్‌ మిత్ర (వాట్సాప్‌ నంబర్‌ 9121211100) సత్ఫలితాలనిస్తోంది. ఈ కేసుల సత్వర పరిష్కారానికి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. 

కోర్ట్‌ బ్లేజ్‌ 
కోర్టు బ్లేజ్‌ అనే అప్లికేషన్‌ ద్వారా సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కేసుల దర్యాప్తు, సంబంధిత అధికారి వివరాలు, ఆయన పనితీరు గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందిస్తుంది. ఈ అప్లికేషన్‌ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. స్కోచ్‌ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో ఇది సిల్వర్‌ అవార్డ్‌ దక్కించుకోగా, మరో జాతీయ సంస్థ ఫిక్కీ ప్రకటించిన అవార్డునూ సొంతం చేసుకుంది. 

ఉత్తమ డీజీపీ అవార్డు 
శాంతిభద్రతల పరిరక్షణతోపాటు రాష్ట్ర పౌరులకి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నందుకు దేశంలో ఉత్తమ డీజీపీగా సవాంగ్‌కు ఈ అవార్డు ప్రకటించారు. పోలీసు శాఖలో పరివర్తనతో కూడిన మార్పునకు కారణమైన నాయకుడిగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. సవాంగ్‌ అత్యున్నత నాయకత్వ లక్షణాలు కనబరుస్తున్నారని ప్రశంసించారు.  

దేవాలయాల పరిరక్షణ 
దేశంలో ఆలయాల పరిరక్షణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని విధంగా ఏపీ పోలీసు విభాగం అనేక రక్షణ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా కమిటీలను నియమించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, జియో ట్యాగింగ్‌తో పాటు సెక్యూరిటి ఆడిట్‌ చేయటం ద్వారా దేవాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తోంది. ఇందుకుగాను జాతీయ స్థాయి అవార్డు లభించింది.  

సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టం 
మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టం కోసం పైలెట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 500 పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేశారు. వీటిల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటిని పోలీస్‌ ప్రధాన కార్యాలయంతో అనుసంధానించినందుకుగాను గోల్డ్‌ అవార్డు లభించింది.

 ఐసీజేఎస్‌ (ఇంటర్‌ ఆపరెబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌): పౌరులకు పారదర్శకంగా సత్వర న్యాయాన్ని అందించే దిశగా ఇంటర్‌ ఆపరెబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టంను కేంద్ర హోంశాఖ ఏర్పాటుచేసింది. దేశంలో రూల్‌ ఆఫ్‌ లా అమలులో ఇది అత్యంత కీలకం. ఈ విధానంలో పౌరులకు ఉత్తమమైన సేవలు అందిస్తున్న ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుందని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.