గవర్నర్ కు వ్రాసిన లేఖల `లీక్’పై నిమ్మగడ్డ పిటీషన్  

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు తాను వ్రాస్తున్న లేఖలు `లీక్’ అవుతున్నాయని అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  నేడు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పిటీషన్ ను తాను పరిశీలింపలేనని చెబుతూ, మరో బెంచ్ కు మార్చమని ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నట్లు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
పిటిషన్‌లో తాను గవర్నర్‌తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ బయటికి లీకవుతున్న విషయంపై నిజానిజాలేంటో తేల్చాలని  నిమ్మగడ్డ కోరారు. అంతేకాదు.. ఈ అంశాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ‘నేను గవర్నర్‌కు రాస్తున్న లేఖలు పబ్లిక్ కాదు.. ప్రివిలేజ్ లెటర్స్.. అవి ఎలా బయటికి వస్తున్నాయనేది విచారణ చేయాలి. నేను సెలవు పెడుతోన్న విషయాలు సైతం ఎలా బయటికి లీవుతున్నాయి?” అంటూ రమేష్ కుమార్ విస్మయం వ్యక్తం చేశారు.
‘నేను గవర్నర్‌కు రాసిన లేఖలు సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెప్తున్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రతివాదులుగా చేరుస్తున్నాను’ అని పిటిషన్‌లో నిమ్మగడ్డ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణ సందర్భంగా ‘నాట్ బీ ఫోర్ మి’ అని హైకోర్ట్ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టీస్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిటిషన్‌ను వేరే బెంచ్‌కి వేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి సూచించారు. దీంతో ఇవాళ ఎటువంటి విచారణ జరగలేదు. చీఫ్ జస్టిస్.. హైకోర్ట్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు.
కాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదుతో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన నోటీసుపై కూడా నిమ్మగడ్డ స్పందించారు. తాను కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నానని, విచారణకు హాజరు కాలేనని కమిటీకి సమాచారం అందించారు. 
 
తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీలోకి రాదని, తనపై ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కోరారు. అసెంబ్లీపై, సభ్యులపై తనకు పూర్తి గౌరవం ఉందని రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు.