దేశంలోనే సంపన్న పార్టీలు `తెలుగు’ పార్టీలు 

రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలు దేశంలోనే సంపన్నమైన పార్టీలలో మొదటి 10 స్థానాలలో ఉన్నాయి. 2014 నుండి ఈ పార్టీలే రెండు రాష్ట్రాలలో అధికారుమల్లో ఉన్నాయి. పాలనలో ఆర్థికాభివృద్ధి మాట అటుంచి రాష్ట్రాలను అప్పులమయం చేశారు. ఉద్యోగుల జీతభత్యాల కోసం, రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులపై ఆధార పడే దుస్థితిలోకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకు వచ్చారు. 

కానీ ఈ రాజకీయ పార్టీలు ఆర్ధికంగా పరిపుష్ఠిగా ఉన్నాయి. దేశంలో చాలా కొద్దీ రాజకీయ పార్టీలకు మాత్రమే గల ఆర్ధిక వనరులను సమకూర్చుకోగలిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలకన్నా ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం పార్టీ దేశంలోనే నాలుగవ సంపన్న ప్రాంతీయ పార్టీగా నెలకొంది. 

దేశంలోని ధనిక ప్రాంతీయ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీలు నిలిచాయి. 2018-19 సంవత్సరానికిగాను దేశంలో టాప్‌ 10 పార్టీలతో కూడిన జాబితాను ది అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఏడీఆర్‌) విడుదల చేసింది. 

రూ.193 కోట్ల ఆస్తులతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.188 కోట్ల ఆస్తులతో టీఆర్‌ఎస్‌ ఆరో స్థానంలో, రూ.93 కోట్ల ఆస్తులతో వైసీపీ 8వ స్థానంలో నిలిచాయి. దేశంలో అత్యంత ఎక్కువ ఆస్తులున్న పార్టీ సమాజ్‌వాదీనే. 

ఆ పార్టీ.. రూ.572 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బీజేడీ రూ.232 కోట్లతో 2వ స్థానంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే రూ.206 కోట్లతో మూ డో స్థానంలో నిలిచింది. టీడీపీకి రూ.115 కోట్లు, టీఆర్‌ఎ్‌సకు రూ.152 కోట్లు, వైసీపీకి రూ.79 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.

అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి తమ పార్టీకి రూ.18 కోట్ల చొప్పున రుణాలున్నట్లు టీడీపీ, జేడీఎస్‌ ప్రకటించాయి. కాగా బీజేపీ 2,904.18 కోట్ల ఆస్తులను ప్రకటించింది. జాతీయ పార్టీలు వెల్లడించిన ఆస్తుల్లో ఇది 54.29శాతం. కాంగ్రెస్‌ రూ.928.24 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించింది.