‘కల్యాణమస్తు’ జంటలకు బంగారు మంగళసూత్రం

త్వరలో దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహించనున్న కల్యాణమస్తు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి జంటకూ 2గ్రాముల బంగారు మంగళసూత్రం అందజేయాలని నిర్ణయించారు. కొన్నేళ్ల క్రితం నిలిచిపోయిన కల్యాణమస్తును తిరిగి ప్రారంభించాలని టీటీడీ ధర్మకర్తల మండలి గతేడాది నవంబరులో నిర్ణయించింది.
 
తొలుత ఓ గ్రాము మంగళసూత్రం, వెండి మెట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు ఇవ్వాలనుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ గ్రాము బంగారంతో మంగళసూత్రం (రెండు బొట్లు) తయారు చేయడం కష్టమని హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ  పేర్కొంది, ఈ క్రమంలో 2 గ్రాముల బంగారంతో మంగళసూత్రం ఇవ్వాలని ఇటీవల బోర్డు తీర్మానం చేశారు. 
ట్రెజరీలో ఉన్న 20 వేల మంగళ సూత్రాలను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చారు. కాగా, శ్రీవారి ఆశీస్సులతో వివాహం చేసుకునే జంటలు ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వరాలతో జీవించగలిగే శుభ లగ్నాలను టీటీడీ గత నెల 17వ తేదీన ఖరారు చేసిన విషయం తెలిసిందే. మే 28, అక్టోబరు 30, నవంబరు 17 తేదీలను ఎంపిక చేసిన టీటీడీ.. ప్రాంతాలను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
సనాతన హిందూ ప్రచార కార్యక్రమంలో భాగంగా గతంలో 2007 నుండి 2011 వరకు ఈ కార్యక్రమాన్ని ఆరు దశలలో టిటిడి విజయవంతంగా నిర్వహించింది. తమ పిల్లల వివాహ ఖర్చులు భరింపలేని పేద కుటుంబాల వారి కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. వేద పండితుల బృందం సమావేశమై ఈ కార్యక్రమ ముహూర్తాలను నిర్ణయించి, లగ్న పత్రికను కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డికి అందజేశారు. సంప్రదాయం ప్రకారం శ్రీవారి పాదాల చెంత ఈ లగ్న పత్రికను ఉంచి, దైవాశీస్సులు పొందుతారు.