మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గాంధారి మాదిరిగా తయారయ్యారని మాజీ ఎమ్మెల్యే, జగ్మోహన్ దాల్మియా కుమార్తె వైశాలీ దాల్మియా విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాలను, ఆకృత్యాలను చూడలేని అంధురాలని, తన సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆగడాలను అరికట్టలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు.
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అన్యాయాలను తరిమికొట్టలేని ఈవిడ.. ఢిల్లీపై కన్నేస్తానని అనడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇముడలేకనే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వైశాలీ దాల్మియాను బీజేపీ అధిష్ఠానం బాలి స్థానం నుంచి బరిలో నిలిపింది.
‘తృణమూల్ కాంగ్రెస్‌లో తాను చెప్పిందే వినాలనే మనస్తత్వం మమతా బెనర్జీది. ఆమె, ఆమె మేనల్లుడి పెత్తనం నచ్చక చాలా మంది పార్టీని వీడారు. ఆటలు ముఖ్యమేకానీ, ప్రజలను అడ్డుగా పెట్టుకొని అభివృద్ధిని పక్కనపడేసి ఆడుకోవాలనుకోవడం మంచిది కాదు పశ్చిమ బెంగాల్‌లో చాలా మంది చాలా రకాల ఆటలు ఆడారు. ఇప్పుడిక ఆటలు సాగవు. ఇలా చేస్తే ప్రజలే ఆడుకుంటారు’ అంటూ ఆమె హెచ్చరించారు.
తనపై దాడి జరిగిందని, కాలుకు తీవ్రంగా గాయమైందని ఎదుటివారిపై ఆరోపణలు చేయడం ఎన్నికల సమయంలో చాలా సాధారణం అని చెప్పారు. మమతలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆమె గాంధారి మాదిరిగా తయారయ్యారు. కమిషన్లు తీసుకోవడానికి, అవినీతికి కేరాఫ్‌గా మిగిలారని వైశాలీ దాల్మియా విమర్శించారు.
పార్టీలో కొందరు చేస్తున్న తప్పిదాలపై గొంతు విప్పడం పార్టీ పెద్దలకు నచ్చలేదు, పార్టీలో చెదపురుగులు తయారయ్యారని అన్నందుకు తనను పార్టీ నుంచి బహిష్కరించారని, ఇదే తాను చేసిన తప్పిదమని ఆమె వాపోయారు.
ఇలా ఉండగా, ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉండి తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన శిశిర్ అధికారి.. ఆదివారం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. పూర్బా మేదినీపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో షాతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు.
ఒకప్పుడు మమతకు సన్నిహితుడిగా ఉండి ఇప్పుడు నందిగ్రామ్‌లో ఆమెపైనే పోటీ చేస్తున్న సువేందు అధికారి తండ్రే ఈ శిశిర్ అధికారి. అధికారి కుటుంబానికి మేదినీపూర్, బాంకురా, పురూలియాల్లోని 30 నియోజకవర్గాలపై పట్టు ఉంది. 23 ఏళ్ల పాటు టీఎంసీతో ఉన్న శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి