`మహా’ హోం మంత్రి రాజీనామాకు ఫడ్నవీస్ డిమాండ్

అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖలో అనిల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో దేవేంద్ర ఈ డిమాండ్ చేశారు. 

మహారాష్ట్ర హోం మంత్రి పదవిలో అనిల్ దేశ్‌ముఖ్ కొనసాగుతున్నంత కాలం ఈ ఆరోపణలపై విచారణ జరగదని చెప్పారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను కాపాడేందుకు  శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సత్యాన్ని శరద్ పవార్ మరుగుపరుస్తున్నారని దుయ్యబట్టారు. 

పోలీసుల బదిలీల్లో అవినీతికి సంబంధించి ఓ నివేదికను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మహారాష్ట్ర డీజీ సుబోధ్ జైశ్వాల్ ఇటీవల సమర్పించారని ఫడ్నవీస్ చెప్పారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్య తీసుకోలేదని, దీంతో డీజీ జైశ్వాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని ఆరోపించారు. 

కాగా,  మహారాష్ట్రను పరిపాలించే నైతిక అర్హతను ఉద్ధవ్ థాకరే కోల్పోయారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కనీసం ఒక రోజైనా ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఆయనకు లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర హోం మంత్రి టార్గెట్ రూ.100 కోట్లు అయితే, మిగిలిన మంత్రుల టార్గెట్ ఎంత? అని ప్రశ్నించారు. ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌కు వివరాలు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు.