వాజేను ప్రతి నెలా రూ 100 కోట్ల ముడుపులు కోరిన హోంమంత్రి 

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఎ అరెస్ట్ చేసిన ముంబై పోలీస్ అధికారి  సచిన్ వాజేను ప్రతి నెలా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు.
 
 ఈ కేసులో సరిగా విచారణ చేపట్టని కారణంగా గత వారం బదిలీ అయినా తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు వ్రాసిన లేఖలో ఆయన చేసిన ఈ ఆరోపణ రాజకీయంగా కలకలం రేపుతున్నది. రెస్టారెంట్లు, హోటళ్లు తదితరాల నుంచి లంచాలు వసూలు చేసి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని అడిగేవారని, ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని పేర్కొన్నారు. 
 
ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌లోని క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్‌ అయిన సచిన్‌ వాజేను హోంమంత్రి గత కొన్ని నెలలుగా తన ఇంటికి పిలుపించుకున్నారని తెలిపారు. నెలకు వంద కోట్లు వసూలు చేయాలని తనకు టార్గెట్‌ ఉన్నదని, దీనికి సహకరించాలని వాజేకు హోంమంత్రి చెప్పారని తెలిపారు. సచిన్‌ వాజే హోంమంత్రిని కలిసిన సందర్భాల్లో ఆయన వ్యక్తిగత కార్యదర్శి మిస్టర్ పలాండే కూడా ఉన్నారని పేర్కొన్నారు.
 
వంద కోట్ల రూపాయల లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గాలను కూడా మంత్రి సూచించారని సింగ్ ఆ లేఖలో వెల్లడించాయిరు. ముంబైలో 1,750 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ఒక్కో దాని నుంచి రూ. 2-3 లక్షలు వసూలు చేసినా నెలకు రూ. 40-50 కోట్లు అవుతుందని, మిగతా మొత్తాన్ని ఇతర వనరుల ద్వారా సేకరించాలని వాజేను మంత్రి ఆదేశించారని వివరించారు.  
 
పరమ్ బీర్ సింగ్ ఆరోపణలను మంత్రి దేశ్‌ముఖ్  ఖండించారు. ముకేశ్ అంబానీ, మన్‌సుఖ్ హిరెన్ కేసులో సచిన్ వేజ్ పాత్ర ఉందని దర్యాప్తులో తేటతెల్లమైందని, ఈ కేసులో తదుపరి దారులన్నీ సింగ్ వైపే దారి తీస్తున్నాయని అన్నారు. వాటి నుంచి బయటపడేందుకే సింగ్ ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.