కొత్త సీజేఐ నియాకం కసరత్తు ప్రారంభం

నూతన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామకానికి కసరత్తును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సిఫారసు చేయాలని ఆయనను కోరింది.

విశ్వసనీయ వర్గాలు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం జస్టిస్ బాబ్డేకు ఓ లేఖను పంపించారు. తదుపరి సీజేఐ నియామకంపై సిఫారసు చేయాలని కోరారు. 

ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల ఎంపిక విధానం ప్రకారం పదవిని నిర్వహించేందుకు తగిన యోగ్యతగల సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. తదుపరి సీజేఐ నియామకం కోసం, తగిన సమయంలో, కేంద్ర న్యాయ శాఖ మంత్రి  పదవీ విరమణ చేయబోతున్న సీజేఐ సిఫారసును కోరాలని ఈ నిబంధనలు చెప్తున్నాయి. 

కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఈ ప్రక్రియలో భాగంగా సీజేఐ సిఫారసును ప్రధాన మంత్రికి సమర్పిస్తారు. ప్రధాన మంత్రి సలహా మేరకు సీజేఐని రాష్ట్రపతి నియమిస్తారు. 

సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించేందుకు తగిన యోగ్యతలు లేనివారైతే, ఇతర న్యాయమూర్తులతో చర్చలు జరిపి తదుపరి సీజేఐని నియమిస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అందరికన్నా సీనియర్ న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన జస్టిస్ ఎన్‌వీ రమణ. ఆయన పదవీ కాలం 2022 ఆగస్టు 26 వరకు ఉంది.