2024 నాటికి రిమోట్ ఓటింగ్!

దేశంలో రిమోట్ ఓటింగ్ పద్థతి 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు పనులు వచ్చే రెండు మూడు నెలల్లో ఆరంభం అవుతాయని చెప్పారు. 
 
అంతా అనుకూలిస్తే రిమోట్ ఓటింగ్ 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటి మద్రాసు, ఇతర ఐఐటిలకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు, ఇతర విశిష్ట సంస్థలతో ఈ దిశలో సంప్రదింపులు జరిగాయి. సంబంధిత విషయంపై ఇప్పటికే రిసెర్చ్ ప్రాజెక్టు ఆరంభం అయిందని వివరించారు.
 
నమూనా ప్రయోగాత్మక దశ వచ్చే రెండు నుంచి మూడు నెలల కాలంలో చేపడుతారని తెలిపారు. ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచి అయినా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ సరికొత్త వ్యవస్థ వీలు కల్పిస్తుంది.  ఎలక్ట్రానిక్ లేదా ఆన్‌లైన్ పద్థతిలో ఓటును వేసుకునేందుకు, పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ఈ విధానం ఉంది. కొన్ని దేశాలలో అమలులో ఉంది. 
 
రిమోట్‌ ఓటింగ్‌ అంటే ఇంటర్నెట్‌ ద్వారా కానీ, ఇంటి దగ్గర నుంచి కానీ ఓటు వేయడం కాదని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రక్రియలో ఎలా ఓటింగ్‌ నిర్వహించాలన్నదానిపై ఇంకా కసరత్తు జరుగుతున్నదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.
 
ఇంటర్నెట్‌ ఓటింగ్‌ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఎస్తోనియా 2005లో అందుబాటులోకి తెచ్చింది. అప్పుడు 9,317 మంది ఈ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకొన్నారు. స్విట్జర్లాండ్‌, అస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ ఇలా పలు దేశాల్లో రిమోట్‌ ఓటింగ్‌ అమల్లో ఉంది. అయితే అమలు విధానంలో దేశాల మధ్య తేడాలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా చాలా దేశాలు ఇంటర్నెట్‌ ఓటింగ్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నాయి.
 
ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న రిమోట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో.. ఓటరు ఎక్కడ నివాసం ఉంటున్నా కూడా అతని సమీపంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్‌ పోలింగ్‌ బూత్‌ ద్వారా ఓటేయవచ్చు. దీని కోసం ఓటరు ముందుగా రిమోట్‌ ఓటింగ్‌ కోసం తన పేరును నమోదు చేసుకోవాలి. 
 
ఇలా పేర్లు నమోదు చేసుకొన్న ఓటర్లను వారు నివాసం ఉంటున్న ప్రాంతాల వారీగా గ్రూపులుగా విభజించి వారికి సమీపంలో ఉమ్మడి పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేస్తారు. పోలింగ్‌ సమయంలో ఓటర్లకు ఇంటర్నెట్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ జనరేట్‌ అవుతుంది. ఓటర్లు తమకు కేటాయించిన బూత్‌కు వెళ్లి వేలిముద్రల యాక్సెస్‌ తీసుకొని ఓటేయవచ్చు.