బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

బెంగాల్‌లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తన సభలకు ప్రజలు భారీగా హాజరవుతున్నారని, రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ అని స్పష్టమవుతోందని చెప్పారు.

రాష్ట్రానికి మంచి భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దాదాపు 130 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని ప్రధాని కొనియాడారు. రాష్ట్రం సౌభాగ్యంతో కళకళలాడాలంటే బీజేపీ ప్రభుత్వమే రావాలని స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో శనివారం జరిగిన బీజేపీ శాసన సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, ‘‘బీజేపీని ఆశీర్వదించడానికి మీరంతా పెద్ద సంఖ్యలో రావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. దీనినిబట్టి ఈసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టమవుతోంది” అని చెప్పారు. 

ఈ సందర్భంగా బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ను మోదీ ప్రశంసించారు. దిలీప్ ఘోష్‌పై అనేక దాడులు జరిగాయని, ఆయనను హత్య చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని, అయినప్పటికీ ఆయన పశ్చిమ బెంగాల్ భవిష్యత్తు కోసం కృషిని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆయనలాంటి నేత పార్టీకి అధ్యక్షుడు కావడం తనకు గర్వకారణమని చెప్పారు. నేడు ఆయన యావత్తు రాష్ట్రానికి కొత్త శక్తిని అందిస్తున్నారని ప్రశంసించారు.

గత రాత్రి 50-55 నిమిషాల పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోయినందుకు అందరూ ఎంతో ఆందోళన చెందారని చెబుతూ  కానీ, బెంగాల్‌లో అభివృద్ధి, సుపరిపాలన 50-55 ఏళ్ల నుంచి ఆగిపోయిందని ప్రధాని ధ్వజమెత్తారు. దీని గురించి మరింత ఆందోళన చెందాలని బెంగాల్ ప్రజలకు సూచించారు. 

మొదట కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ప్రస్తుతం తృ‌ణమూల్.. బెంగాల్‌లో అభివృద్ధిని నిలిపివేశాయని ప్రధాని మండిపడ్డారు.  కాంగ్రెస్‌, లెఫ్టి పార్టీలు విధ్వంసం సృష్టించాయ‌ని, టీఎంసీ మీ ఆశ‌ల్ని చ‌దిమేసింద‌ని అంటూ  గ‌త 70 ఏళ్లుగా ప్ర‌తి ఒక్క‌రికీ మీరు అవ‌కాశం ఇచ్చారని ప్రధాని చెప్పారు. “ఈసారి అయిదేళ్ల కోసం మాకు అవ‌కాశం ఇవ్వండి” అంటూ ప్ర‌ధాని మోదీ కోరారు. ‘మాకు పాల‌న‌ను అందిస్తే, 70 ఏళ్ల విధ్వంసం నుంచి బెంగాల్ విముక్తి అవుతుంది” అంటూ భరోసా వ్యక్తం చేశారు.

`ఆయుష్మాన్ భారత్` పథకం కింద ఉచిత వైద్య చికిత్స తమకెందుకు దక్కడం లేదని బెంగాల్‌లోని పేదలు అడుగుతున్నారని చెప్పారు. `కిషాన్ సమ్మన్ నిథి` నుంచి తన ఖాతాలోకి వేల రూపాయలు ఎందుకు రావడం లేదని బెంగాల్ పేద రైతు అడుగుతున్నాడని అంటూ మమతా బెనర్జీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని మోదీ దుయ్యబట్టారు.