రైతు సమస్యల పరిష్కారంకు దేశ వ్యతిరేక శక్తుల అడ్డు 

నాలుగు నెలలకు పైగా జరుగుతున్న రైతుల ఆందోళనకు పరిష్కారం లేకుండా దేశ వ్యతిరేక, సామజిక వ్యతిరేక శక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు ఏ రూపంలో చేపట్టినా అవి సుదీర్ఘం కారాదని, ఏ ఒక్కరి ప్రయోజనాలకు ఇది మంచిది కాదని హెచ్చరించింది.

బెంగుళూరులో ప్రాంరంభమైన ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) రెండు రోజుల సమావేశాలలో తొలిరోజు ఈ అంశంను ప్రస్తావిస్తూ చర్చలు తప్పనిసరిగా జరగాలని, అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారానికి కుదరక పోయినా కొన్నింటినైనా పరిష్కరించుకునే వీలుంటుందని స్పష్టం చేసింది.
మూడు సాగు చట్టాలపై కేంద్రంతో పలు విడతల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఆందోళనల వల్ల రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలగడం ఆందోళన కలిగించే మరో విషయమని పేర్కొంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ఇందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే దేశాన్ని అస్థిపరపరచడం, అశాంతిని రేకిత్తించే హక్కు మాత్రం ఎవరికీ ఉండదని ఆర్ఎస్ఎస్ఎ స్పష్టం చేసింది.  ఈ చట్టాలను పార్లమెంట్ మెజారిటీతో ఆమోదించిందని, ఆ తర్వాతనే రైతుల ఆందోళన క్రమంగా ఉధృతం అవుతూ వస్తున్నదని గుర్తు చేసింది.
చట్టాలను సవరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఆందోళకారులు చట్టాలను రద్దు చేయాలనే తమ డిమాండ్లనే పట్టుకొని ఉండడం పట్ల విచారం ప్రకటించింది.