అపరాధి అపరాధే, వారికి ఏ మతమూ ఉండదు 

అపరాధి అపరాధేనని, వారికి ఏ మతమూ ఉండదని అంటూ యూపీ ఎన్‌కౌంటర్ల విషయంలో ఎంఐఎం అధినేత ఒవైసీ చేసిన వాఖ్యాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తిప్పికొట్టారు. 
 తాము జీరో టాలరెన్స్ విధానంపై తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఏవరేమన్నా అదే దిశగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
 
ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ ‘‘ 2017 లో మేము అధికారంలోకి వచ్చాం. ఆ సమయంలో రోడ్లు లేవ్. పాఠశాలల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ లేవు. కొందరి ఓటు హక్కు కూడా లేదు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మార్చాం.’’ అని వివరించారు. 
 
ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎటువంటి అల్లర్లు జరగలేదని, పండుగలు అన్ని ప్రశాంతంగా జరిగాయని గుర్తు చేశారు. గతంలో ప్రతి పండుగ సందర్భంగా హింస చోటు చేసుకొనేదని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసినదని చెబుతూ తమ ప్రభుత్వ పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపించిందని పేర్కొన్నారు. 
 
పలు పోలీస్ సంస్కరణలను కూడా అమలు చేస్తున్నామని, నేరస్థులలో భయం నెలకొనేటట్లు చేయగలిగామని చెబుతూ నాలుగేళ్లలో నేరస్థుల నుండి ఆక్రమించుకున్న రూ 750 కోట్ల విలువైన భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని ఆదిత్యనాథ్ చెప్పారు. 
 
రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినదని చెబుతూ చెరకు రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లలో రూ 1.27 లక్షల కోట్లు చెల్లించామని, కరోనా సమయంలో కూడా మొత్తం 119 చక్కర కర్మాగారాలు పనిచేశాయని ముఖ్యమంత్రి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పలు సాగునీటి పధకాలను పూర్తి చేసిన్నట్లు చెప్పారు. 
 
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో గణనీయ మెరుగుదల సాధించామని చెబుతూ జిల్లా కేంద్రాలలో 24 గంటలు, తెహసిల్స్ లో 20 నుండి 22 గంటలు, గ్రామీణ ప్రాంతాలలో 16 నుండి 18 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతున్నదని వివరించారు. 
 
ఇక సాంస్కృతిక పర్యాటక రంగంలో రాష్ట్రం పురోభివృద్ధిలో సాగుతున్నామని, ప్రయాగ రాజ్ కుంభమేళా మొదలు, అయోధ్య రామ మందిర నిర్మాణం వరకూ విజయవంతంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పది నగరాలలో మెట్రో రైళ్ల  పనులు వేగంగా జరుగుతున్నాయని చెబుతూ నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని భరోసా వ్యక్తం చేశారు.