బెంగాల్‌లో 15 చోట్ల నాటుబాంబు దాడులు

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో దాడులు, ప్రతిదాడులూ సాధారణంగా మారాయి. 
 
తాజాగా బుధవారం అర్ధరాత్రి దాటక వరుసగా 15 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపుతోంది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారు. ఎన్నికల అధికారులు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన ఉత్తర 24 పరగణ జిల్లాలోని భట్‌పారాలోని జగత్దల్‌లోని బరాక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసానికి దగ్గరలోనూ పేలింది.
 
నిందితులు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను సైతం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా  స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలో ఓ వ్యక్తి బాంబు విసిరాడని ఆరోపించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్‌ మాట్లాడుతూ గత పది రోజులుగా భద్రత కల్పించాలని కోరుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికార పార్టీ బీజేపీ నేతల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజలు ఓట్లు వేయకుండా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దాడుల ఘటనపై బీజేపీ నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాస్‌ విజయ్‌ వర్గీయ స్పందించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఏసీపీ ఏపీ చౌధరి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాంబుదాడులకు కారణమైన వారిని గుర్తిస్తామని చెప్పారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.