ఆధునిక విమానాశ్రయం వలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్!

ప్రైవేట్ భాగస్వామ్యంతో రైల్వే స్టేషన్లను అత్యాధునికంగా, లాభదాయకంగా అభివృద్ధి చేసేందుకు కృషిప్రారంభించిన భారతీయ రైల్వేలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునిక విమానాశ్రయం రీతిలో అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

దేశంలోనే పెద్ద రైల్వే స్టేషన్లను  ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వాణిజ్యపరంగా ఆదాయాన్ని పొందేందుకు ఏర్పర్చిన ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) ఈ దిశలో కార్యాచరణ ప్రారంభిస్తోంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రణాళిక కోసం   ఆసక్తివ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) నోటిఫికేషన్‌ను ఈ నెలలోనే పిలవబోతున్నారు.  అందులో ముందుకొచ్చే సంస్థలతో సంప్రదింపులు జరిపి కొత్త విధానాన్ని ఖరారు చేయనున్నారు.

 కొత్త ఆలోచనలో మెట్రో రైలును కూడా చేర్చనున్నారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు ప్రత్యేకంగా మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు. సాధారణ రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఎస్కలేటర్‌ ద్వారా పక్కనే ఉన్న మెట్రో రైలు స్టేషన్‌లోకి చేరుకుంటారు. 

అక్కడ మెట్రో రైలు ఎక్కి గమ్యస్థానం వైపు వెళ్తారు. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఐఆర్‌ఎస్‌డీసీ ఎండీ మెట్రో రైలు అధికారులతో భేటీ అయ్యారు. అలాగే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కూడా కలిసి పనిచేయనున్నట్లు వారు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం రైళ్లు, రైల్వేస్టేషన్ల నిర్వహణ అంతా రైల్వే శాఖనే చూస్తోంది. ఇక భవిష్యత్‌లో ఆ భారాన్ని  ఐఆర్‌ఎస్‌డీసీనే చూస్తుంది. వాణిజ్యపరంగా స్టేషన్‌ను అభివృద్ధి చేసి భారీగా ఆదాయంపొందే విధంగా తగిన  విధానాన్ని ఇప్పుడు ఖరారు చేయనున్నారు.

 ప్రస్తుతానికి తెలంగాణలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను మాత్రమే దీని ప్రకారం అభివృద్ధి చేయనుండగా, ఆ తర్వాత నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, కాజీపేట, వరంగల్, తాండూరు, వికారాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, ఖమ్మం తదితర స్టేషన్లను అధీనంలోకి తీసుకోనుంది.