జిన్నా అడుగుజాడల్లో రాహుల్‌  

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారని  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం దిబ్రూగర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి శివరాజ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ  కాంగ్రెస్‌ మహాత్మాగాంధీ బాటలో పయనించడం లేదని, రాహుల్‌ సహా కాంగ్రెస్‌ పార్టీ నేతలు జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ధోరణి  ఇది అసోంతో పాటు భారత్‌ విచ్ఛిన్నానికి  దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసోంలో ఏఐయూడీఎఫ్‌, కేరళలో ఐయూఎంఎల్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ చౌహాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో  ఎలాంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టలేదని విమర్శలు గుప్పించారు. 55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏమిచ్చినదని ప్రశ్నించారు. 

కేంద్రం లోని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు కేవలం చొరబాటుదారులు, హింస, ఉగ్రవాదం, ఆకలి, నిరుద్యోగులను మాత్రమే అస్సాం ప్రజలకు మిగిల్చాయని ధ్వజమెత్తారు. కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అస్సాంలో, ఇతర ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో అభివృద్ధి ప్రారంభమైనది చౌహన్ తెలిపారు. 

అసోంలో చొరబాట్లను ప్రేరేపించిన బద్రుద్దీన్‌ అజ్మల్‌తో కాంగ్రెస్‌ జట్టుకట్టిందని, ఫెర్ఫ్యూమ్‌ వ్యాపారం చేసే ఆయన సమాజంలో విషాన్ని వ్యాపింపచేస్తున్నారని దుయ్యబట్టారు. బద్రుద్దీన్‌ అజ్మల్‌కు చెందిన ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్‌ చేతులుకలపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

మాజీ సీఎం తరుణ్‌ గగోయ్‌ సైతం ఆ పార్టీతో జట్టుకట్టలేదని గుర్తు చేశారు. అసోంలో భిన్న తెగలు, వర్గాల మధ్య రాహుల్‌ గాంధీ అంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కలసి పోతుందని చౌహన్ ఎద్దేవా చేశారు.