‘ఫోన్‌ ట్యాపింగ్‌’కు పాల్పడినట్లు గెహ్లాట్‌ అంగీకారం 

గతేడాది జూలైలో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభ సమయంలో ‘ఫోన్‌ ట్యాపింగ్‌’ చేశామని అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకున్నది. దీంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై బీజేపీ విరుచుకుపడింది. 

సీఎం పదవిని కాపాడుకునేందుకు అయన చట్టాలను ఉల్లఘించారని, అన్ని హద్దులు దాటారని ధ్వజమెత్తింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు,  పలువురు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతలకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు లీకైన 8 నెలల తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ జరగడం నిజమేనని గెహ్లాట్‌ ప్రభుత్వం ఇప్పుడు అంగీకరించింది. 

ఫోన్‌ ట్యాపింగ్‌పై గతేడాది ఆగస్టులో అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తన సమాధానాన్ని ఇటీవల అసెంబ్లీ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. అయితే ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేశారో తెలుపలేదు.

ఫోన్ ట్యాప్పింగ్ ఆరోపణలను గతంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఖండించడం గమనార్హం. విజయరాజ్ సింధియా ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన ప్రస్తుత శాసనసభ్యుడు కాళిచరణ్ సరఫ్ అడిగిన ప్రశ్నకు ఈ జవాబు ఇచ్చారు. ‘ఫోన్ ట్యాప్పింగ్ కు పాల్పడడం నిజమేనా? నిజమైతే, ఏ చట్టం ప్రకారం, ఎవ్వరి ఆదేశాల మేరకు పాల్పడ్డారు? దయచేసి సభకు వివరాలు తెలపండి” అని ఆయన ప్రశ్నించారు. 

“ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, అందుకు విఘాతం కలిగించే నేరాన్ని నిరోధించడం కోసం భారత టెలిగ్రాఫ్  చట్టం, 1985 లోని సెక్షన్ 5(2), భారత టెలిగ్రాఫ్ చట్టం (సవరణ) నిబంధనలు, 2007 లోని సెక్షన్ 419 (ఎ), సమాచార సాంకేతికత చట్టం, 2000 లోని సెక్షన్ 69 ప్రకారం అధికారం గల అధికారి అనుమతితో టెలిఫోన్ ల ట్యాప్పింగ్ జరుగుతుంది” అని సమాధానంలో పేర్కొన్నారు.  

రాజస్థాన్ పోలీసులు ఈ నిబంధనల మేరకు అధికారం గల అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే టెలిఫోన్ ట్యాప్పింగ్ కు పాలపడిన్నట్లు ఆ సమాధానంలో స్పష్టం చేశారు. ఆ విధంగా ట్యాప్పింగ్ చేసిన కేసులను నిబంధనల మేరకు రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేస్తూ ఉంటారని, నవంబర్, 2020 వరకు జరిగిన టెలిఫోన్ ట్యాప్పింగ్ లకు సంబంధించి సమీక్షలు జరిపారని కూడా పేర్కొన్నారు.