తమిళ నాడులో తెలుగులో ఓటర్ల జాబితకై వినతి 

తమిళనాడులో ఓటరు జాబితాను తెలుగులో ముద్రించి అందజేయాలని ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారు అధికంగా నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. 
 
రాష్ట్రంలో కృష్ణగిరి, కోయంబత్తూరు, సేలం, విరుదునగర్‌, తిరుచ్చి, మదురై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లో తమిళులకు సమానంగా తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ, హిందీ మాట్లాడే ప్రజలు నివశిస్తున్నారని ఆ లేఖలో గుర్తు చేశారు. 
 
1993 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జారీచేసిన జిఒ 83 ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 15 శాతానికి పైగా తమిళేతరులు నివశిస్తున్నారని, ఆ ప్రజలు ఏ భాషలో ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తే, ప్రభుత్వం వారు ప్రత్యుత్తరాలు కూడా ఆ భాషలోనే ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆదేశాలు సరిగ్గా అమలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. 
 
దీంతో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ద్రావిడదేశం ఇసికి విజ్ఞప్తి చేసిందని, ఆ మేరకు స్పందించిన ఇసి  తిరుత్తణి, హోసూరు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా తెలుగులో ఇచ్చిందని వివరించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళేతర ప్రజలు అధికంగా వుండే ప్రాంతాల్లో తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ, హిందీ భాషల్లో ఓటరు జాబితా అందించాలని విజ్ఞప్తి చేశారు.