రాజ్య‌స‌భ‌కు స్వ‌ప‌న్ దాస్‌గుప్తా రాజీనామా  

రాజ్యసభ ఎంపీ పదవికి స్వపన్ దాస్‌గుప్తా మంగళవారంనాడు రాజీనామా చేశారు. రాజ్యసభకు రాష్ట్రపతి నామినీ అయిన దాస్‌గుప్తాకు పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఆయన నామినేషన్ వేశారు. ఏప్రిల్ 2022 వ‌ర‌కు ఆయ‌న రాజ్య‌స‌భ సభ్యత్వం ఉన్నప్పటికీ   రాజ్య‌స‌భ‌కు రాజీనామా చేయ‌కుండా, ఏ పార్టీలో చేర‌కుండా  ఎలా పోటీ చేస్తార‌ని తృణ‌మూల్ ప్ర‌శ్నించడంతో రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది. తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు పంపారు.

 ప‌ద‌వ షెడ్యూల్ ప్ర‌కారం స్వ‌ప‌న్ దాస్‌గుప్తాను రాజ్య‌స‌భ‌కు అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని తృణ‌మూల్ పార్టీ నేత మ‌హువా మొయిత్రి త‌న ట్వీట్‌లో కోరారు.  కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని లేవ‌నెత్తింది.  ఆ పార్టీ చీఫ్ విప్ జ‌య‌రామ్ ర‌మేశ్‌..  రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు రాసిన లేఖ‌లో ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. సభకు రాజీనామా చేయ‌కుండా, ఏ పార్టీలో చేర‌కుండా ఎలా స్వ‌ప‌న్ కొన‌సాగుతార‌ని జ‌య‌రామ్ ప్ర‌శ్నించారు. 
 
రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేసిన వ్య‌క్తిగా త‌న‌కు రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా ఉంద‌ని చెబుతూ, తార‌కేశ్వ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నాని, అన్ని స‌మ‌స్య‌లు ముగిశాకే నామినేష‌న్ వేస్తాన‌ని అంతకు ముందు స్వపన్ దాస్ గుప్తా స్పష్టం చేశారు. కాగా, నామినేషన్ అనంతరం స్వపన్ దాస్‌గుప్తా మాట్లాడుతూ, రాష్ట్రంలో హింస, లూటీలు వంటి పరిస్థితులు నెలకొన్నాయని, వీటికి బీజేపీ చరమగీతం పాడాలనుకుంటోందని చెప్పారు. బెంగాల్ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా బీజేపీ చూస్తుందని పేర్కొన్నారు. 
రాష్ట్రంలో పని అవకాశాలు కనుమరుగయ్యాయని, ప్రతిభావంతులైన యువత ఉద్యోగాలు, చదువుల కోసం బెంగాల్ విడిచి పోతున్నారని చెప్పారు. టీఎంసీ సిండికేట్ రాజ్‌కు ఉద్వాసన పలికి, బంగారు బంగ్లా సాధనకు ప్రజలు బీజేపీకి సహకరించాలని కోరారు.