బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య.. సవతి తండ్రికి మరణ శిక్ష

ఒకప్పటి బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో దోషిగా తేలిన లైలా ఖాన్ సవతి తండ్రికి మరణ శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. నటి లైలా ఖాన్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులను అతి దారుణంగా హత్య చేసిన కేసు సంచలనం సృష్టించగా, ఆ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత చివరికి 13 ఏళ్ల తర్వాత కోర్టు ఆమె సవతి తండ్రిని దోషిగా తేల్చింది. దీంతో తాజాగా వారికి శిక్షలు ఖరారు చేసింది.

2011లో జనవరి 30 వ తేదీన లైలా ఖాన్ తన తల్లి షెలీనా, నలుగురు అక్కాచెళ్లెళ్లతో కలిసి మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఇగత్‌పురిలో ఉన్న వారి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే ఆ తర్వాతి నుంచి లైలా ఖాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత లైలా ఖాన్ తండ్రి, షెలీనా మొదటి భర్త నదీర్ షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు కొన్ని రోజులుగా కనిపించడం లేదని కేసు పెట్టారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసు విచారణ కొనసాగించారు. అయితే చివరికి షెలీనా మూడో భర్త పర్వేజ్ తక్‌పై అందరికీ అనుమానాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే అతని ఆచూకీ కనిపించలేదు. దీంతో పర్వేజ్ తక్‌పై అనుమానం మరింత పెరగడంతో అతని కోసం గాలింపు చేపట్టారు. కానీ ఎంతకూ దొరక్కపోవడంతో ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది.

ఇక 2012 జూన్‌లో పర్వేజ్‌ తక్‌ను జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు వేరే కేసులో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతన్ని విచారణ చేయగా లైలా ఖాన్, ఆమె కుటుంబ సభ్యులను తానే హతమార్చినట్లు పర్వేజ్‌ తక్‌ ఒప్పుకున్నాడు. దీంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముంబై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫామ్‌హౌస్‌లో సామూహిక హత్యల ఘటన విషయం బయటికి వచ్చింది.

షెలీనా, ఆమె కుమార్తెల పేరు మీద ఉన్న ఆస్తులు తన పేరు మీద రాయాలని వారిపై ఒత్తిడి తీసుకువచ్చిన పర్వేజ్ తక్ చివరికి వారిని చంపేసినట్లు విచారణలో వెల్లడైంది.  ఇక లైలా ఖాన్ కుటుంబం ఫామ్‌హౌస్‌కు వెళ్లిన విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన పర్వేజ్ తక్ వారితో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తన భార్య షెలీనా తలపై కొట్టి హతమార్చాడు. 

అది చూసిన లైలా, ఆమె అక్కాచెల్లెల్లను కూడా అత్యంత దారుణంగా కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో పర్వేజ్ తక్ అంగీకరించాడు. వారి మృతదేహాలను అదే ఫామ్‌హౌస్‌లోనే పాతిపెట్టాడు. ఈ కేసు విచారణ సందర్భంగా పర్వేజ్ ఇచ్చిన సమాచారంతో ఫామ్‌హౌస్‌లో నుంచి ఆరుగురు మృతదేహాల అవశేషాలను పోలీసులు వెలికి తీశారు.  పర్వేజ్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో వెల్లడి కాగా ఈ సామూహిక హత్య తర్వాత నేపాల్‌ పారిపోతుండగా జమ్మూ కాశ్మీర్‌ పోలీసులకు చిక్కాడు.

2002 లో కన్నడ చిత్రం మేకప్‌తో లైలా ఖాన్‌ తొలిసారి సినిమాల్లోకి వచ్చింది. అనంతరం కొన్ని చిన్న చిన్న సినిమాల్లో కనిపించిన లైలా ఖాన్.. 2008 లో రాజేశ్ ఖన్నాతో కలిసి చేసిన ‘వాఫా: ఎ డెడ్లీ లవ్‌ స్టోరీ’ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. కానీ 2011 లో ఆమె హత్యకు గురికావడంతో కెరీర్‌ అర్ధాంతరంగానే ముగిసింది.