8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు నేడే 6వ దశ పోలింగ్

ఆరో దశ ఎన్నికల పోలింగ్ మే 25, శనివారం జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఢిల్లీలోని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 58 నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. మే 25, శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
 
ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే హరియాణాలోని 10, దిల్లీలోని 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా, కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తాయి. దీంతో మే 25న ఆరో విడతలో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.
 
ఈ ఆరో దశలో బీహార్ (8), హర్యానా (మొత్తం 10), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), ఢిల్లీ (మొత్తం 7), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8) నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఆరో దశ పోరులో హరియాణాలో  బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. కురుక్షేత్రను ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్‌, మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. ఈసారి కర్నాల్‌లో పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014, 2019లలో ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది. ఈసారి బీజేపీ తరఫున మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ బరిలో ఉన్నారు. 
 

గురుగ్రామ్‌ లోక్‌సభ స్థానంలో సాఫ్ట్‌వేర్, నిర్మాణ రంగాలు కీలకంగా మారనున్నాయి. 2014, 2019లలో అక్కడ బీజేపీ గెలిచింది. హ్యాట్రిక్‌ కోసం మరోసారి రావ్‌ ఇందర్‌జీత్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ తరఫున బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజ్‌ బబ్బర్‌ బరిలో నిలిచారు. కురుక్షేత్ర లోక్‌సభ స్థానంలో ఈసారి బీజేపీ తరఫున నవీన్‌ జిందాల్ పోటీ చేస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్‌ గుప్తా, ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిగా అభయ్‌ సింగ్‌ చౌటాలా బరిలో ఉన్నారు. రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హూడా, బీజేపీ నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు.దిల్లీలోని ఏడు స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూ దిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె భన్సూరీ స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో న్యూ దిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున మీనాక్షీ లేఖీ గెలిచారు. ఈశాన్య దిల్లీ స్థానంలో బీజేపీ గత రెండు ఎన్నికల్లో విజయం సాధించింది. 

హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ నేత మనోజ్ తివారీ తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి దిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు. వాయవ్య దిల్లీలో కాంగ్రెస్ నుంచి ఉదిత్ రాజ్, బీజేపీ నుంచి యోగేంద్ర చందోలియా పోటీ పడుతున్నారు. చాందినీ చౌక్‌లో బీజేపీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, కాంగ్రెస్ నుంచి జై ప్రకాష్ అగర్వాల్ మధ్య పోటీ నెలకొంది.

జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ సీఎం, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ-PDP అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ స్వయంగా బరిలో ఉన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌-NC నుంచి మియా అల్తాఫ్, అప్నీ పార్టీ తరఫున జఫర్‌ ఇక్బాల్‌ మన్హాస్‌ రంగంలోకి దిగడం వల్ల త్రిముఖ పోరు కనిపిస్తోంది.

బిహార్‌లో వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్ , సివాన్, మహారాజ్‌గంజ్‌లలో ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. వాల్మీకీ నగర్‌లో 2019 సార్వత్రిక, 2020 ఉప ఎన్నికల్లో జేడీయూ గెలిచింది. సిట్టింగ్ ఎంపీ సునిల్ కుమార్ మరోసారి ఇదే స్థానంలో బరిలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి దీపక్ యాదవ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ చంపారన్‌లో బీజేపీ నుంచి సంజయ్ జైయస్వాల్, కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మోహన్ తివారీ మధ్య పోటీ నెలకొంది.

ఆరో విడతలో ఒడిశాలోని భువనేశ్వర్, పురీ, ధెంకనల్, కియోంజర్, కటక్, సంబల్పుర్‌ లోక్‌సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. చాలా స్థానాల్లో బీజేపీ, బీజేడీ మధ్యే పోటీ నెలకొంది. సంబల్‌పుర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు. ఆయనకు బిజెడి నేత ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీ ఇస్తున్నారు. పురీ స్థానంలో గత రెండు ఎన్నికల్లో బిజెడిగెలిచింది. ఈ సారి సిట్టింగ్ ఎంపీ కాకుండా అరుప్ పట్నాయక్‌కు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి సంబిత్ పాత్ర బరిలో ఉన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దఫా 14 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. సుల్తాన్‌పుర్‌లో సిటింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాంభువల్ నిషాద్ మధ్య పోరు జరుగుతోంది. అలహాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఉజ్వల్ రేవతి రమణ్ సింగ్ , బీజేపీ అభ్యర్థి నీరజ్ త్రిపాఠి మధ్య పోటీ నెలకొంది. 

బంగాల్‌లో ఈ విడతలో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. పలు చోట్ల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఝార్ఖండ్‌లో రాంచీ, జంషెద్‌పూర్‌, గిరిదీ, ధన్‌బాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. రాంచీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు కనిపిస్తోంది. జంషెద్‌పుర్‌లో జేఎంఎం, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.