కేజ్రీవాల్ పిఏపై ఫిర్యాదు చేస్తే బిజెపి ఏజెంట్ అంటారా!

ముఖ్యమంత్రి నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్, తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పార్టీ తనను బీజేపీ ఏజెంట్‌గా చిత్రీకరిస్తుందని, పైగా తనకు మద్దతుగా పార్టీలో ఎవ్వరూ నిలబడ్డారని బెదిరించారని వెల్లడించారు.   ఆరోపణలు చేసిన తర్వాత మొదట తన పార్టీ తనకు మద్దతు ఇచ్చిందని, ఆ తర్వాత పూర్తిగా యూ టర్న్ ఇచ్చిందని అనే ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తు చేశారు.

పైగా, మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఆదేశానుసారం పార్టీ చీఫ్‌ని ఇరికించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ఆరోపిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తన ఇంటికి వచ్చారని, అంతా చూసిన తర్వాత మరుసటి రోజు విలేకరుల సమావేశంలో తనకు మద్దతుగా నిలిచారని ఆమె గుర్తు చేశారు.

పైగా, మీడియా సమావేశంలో తన పట్ల `అసభ్యంగా’ ప్రవర్తించినట్లు పేర్కొన్నారని, నిందితునిపై కఠిన చర్య తీసుకోమని కేజ్రీవాల్ ఆదేశించారని ప్రకటించారని ఆమె వివరించారు. అయితే తాను పోలీసులకు ఫిర్యాదు చేయగానే పార్టీ వైఖరి అంతా మారిపోయిందని ఆమె విచారం వ్యక్తం చేశారు.

“నేను ఫిర్యాదు చేసిన రోజు, నేను నిద్ర లేవగానే, నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటంటే, వేలాది మంది అమ్మాయిలు తీవ్రమైన నేరాలకు గురై నా మద్దతు కోసం నా వద్దకు వచ్చారు. నేను ఎప్పుడూ వారికి ధైర్యాన్ని ఇస్తూ ఏమి జరిగినా మీరు పోరాడాలి అని చెప్పేదానిని. ప్రపంచం మొత్తం మీపై తిరగబడినా, మీరు ఒంటరిగా పోరాడవలసి వచ్చినా మీరు పోరాడాలి” అని ఆమె వివరించారు.

చాలా మంది ఆడవాళ్ళతో పోరాడే సాహసం చేసి, అలాంటి పరిస్థితి తనకే ఎదురైనప్పుడు  ఎందుకు ఫిర్యాదు చేయడం లేదనే ప్రశ్న తనకు ఎదురైందని పేర్కొంటూ ఇది క్రిమినల్ కేసు అయినందున తానే అధికారికంగా ఫిర్యాదు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. అందుకే ఫిర్యాదు చేశాను అని స్వాతి మలివాల్ వెల్లడించారు.

“ఒక వ్యక్తి పార్లమెంటు సభ్యురాలిని, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ని ముఖ్యమంత్రి  డ్రాయింగ్‌రూమ్‌లో ఇంత దారుణంగా కొట్టగలడని ధైర్యం చేయగలడని ఈ ఆలోచన నాకు మళ్లీ వస్తోంది. అప్పుడు అతను ఏమి చేయగలడు? ఆసక్తురాలైన ఓ మహిళను అతనేమీ చేయగలడనే ఆలోచనలు నా మదిలోకి వచ్చాయి.. అందుకనే నేను తగినంత శక్తిని కూడగట్టుకుని పోరాడాలని నిర్ణయించుకున్నాను, “అని ఆమె తెలిపారు.

తన అవినీతికి పాల్పడ్డారంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, బీజేపీ సూచనల మేరకే తాను ఈ  కేసు పెట్టానని ఢిల్లీ మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.”నేను తొమ్మిదేళ్లుగా ప్రజాజీవనంలో ఉన్నాను, అంతకుముందు నేను 2006 నుండి పని చేస్తున్నాను. కానీ నేను తెరవెనుక పనిచేసాను.  2015 నుండి నేను ఫీల్డ్‌లో పని చేస్తున్నాను. నేను చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాను” అని తెలిపారు.

“ఈ దేశంలో ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఈరోజు నేను లేడీ సింగమ్‌గా ఉన్నాను పార్టీలో ఎక్కువ ప్రభావం చూపి అందరి అభిమానాన్ని చూరగొన్నాను. అలాంటి వ్యక్తిపై నేను ఫిర్యాదు చేశానని బీజేపీకి ఏజెంట్‌గా మారానని అంటారా?” అని ఆమె ప్రశ్నించారు.

2016లో తనపై నమోదైన కేసు గురించి బిజెపి తనను బెదిరించినట్టు ఢిల్లీ మంత్రి అతిషి తనపై చేసిన ఆరోపణలను మలివాల్ కొట్టిపారేసారు. ఇది “పూర్తిగా తప్పుడు కేసు” అని స్పష్టం చేశారు.”నాపై 2016లో కేసు పెట్టారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు. కేసులో ఎలాంటి మెరిట్ లేదు. 2017లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నన్ను ఎప్పుడూ అరెస్టు చేయలేదు. చార్జిషీట్ దాఖలు చేసినందున ఎప్పటికీ అరెస్టు చేయరు” అని ఆమె తేల్చి చెప్పారు.

పైగా, ఈ కేసు పెట్టిన తర్వాతనే తనకు ఢిల్లీ మహిళా కమిషన్‌లో మరో రెండుసార్లు పదవీకాలం పొడిగించారంటే తప్పుడు కేసు అని స్పష్టం అయిన్నట్లే గదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గాని, లెఫ్టనెంట్ గవర్నర్ గాని తన పదవీకాలం పొడిగించేందుకు ఈ కేసు అడ్డు రాలేదని ఆమె గుర్తు చేసారు. పైగా, ఈ కేసుపై హైకోర్టు స్టే ఇప్పటికే స్టే ఇవ్వడంతొ తాను భయపడే ప్రసక్తి ఎక్కడ? అని ఆమె నిలదీశారు.