30 ఏళ్ళ తర్వాత కేన్స్ లో భారతీయ చిత్రం సందడి

ప్రాన్స్ వేదికగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగా వైభవంగా జరిగింది.  కేన్స్‌ ఉత్సవంలో భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ పోటీలో నిలిచింది. ఈ ఉత్సవంలో ప్రధాన విభాగమైన ‘పామ్‌ డి ఓర్‌’ అవార్డుల కేటగిరీలో మలయాళీ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ ఎంపికైంది. గురువారంనాడు ఈ సినిమాను ప్రదర్శించారు. 
 
ఈ సందర్భంగా దర్శకురాలు పాయల్‌ కపాడియాతో పాటు నటీనటులు ఎర్ర తివాచీపై సందడి చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ ఫొటోలకు పోజులివ్వడం అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. మధ్యతరగతి యువతుల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన ఈ సినిమాకు కేన్స్‌లో విశేష ఆదరణ లభించింది.
 
 దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ చిత్ర ప్రదర్శన పూర్తయిన తర్వాత టీమ్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. పాయల్‌ కపాడియా దర్శకత్వం వచ్చిన తొలి ఫీచర్‌ సినిమా ఇదే కావడం విశేషం. అంతకుముందు ఆమె తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌’.. 2021 కేన్స్‌ ఉత్తమ డ్యాకుమెంటరీగా అవార్డు అందుకుంది.
 
 ఈ వేడుకల్లో భారత్‌ నుంచి ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ పోటీలో నిలవడం 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. 1994లో ‘స్వహం’ సినిమా ‘పామ్‌ డి ఓర్‌’ కేటగిరీలో పోటీ పడింది. తాజాగా ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’తో పాటు యోర్గోస్‌ లాంతిమోస్‌, మెగాలోపోలిస్‌, ఓహ్ కెనడా, బర్డ్‌, అనోరా తదితర చిత్రాలు బరిలో నిలిచాయి. వీటిలో విజేతను శనివారం ప్రకటించనున్నారు.
భారతీయ షార్ట్‌ ఫిలింకు మొదటి బహుమతి
 
భారత్‌కు చెందిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్‌ టు నో’ షార్ట్‌ఫిలిం 2024కు గాను ఉత్తమ షార్ట్‌ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది. చిదానంద ఎస్‌ నాయక్‌ తెరకెక్కించిన ఈ చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడింది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్‌ స్కూల్స్‌ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 
 
16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్‌ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇదే విభాగంలో బన్నీహుడ్‌’ అనే యుకె చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్ర నిర్మాత మహేశ్వరి రూపొందించారు. ఉత్తమ షార్ట్‌ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్‌కు 1500 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. 
 
ఈ రెండు షార్ట్‌ ఫిలిం టీమ్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ చిత్రోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి.