రానున్న ఐదు లేదా ఏడు ఎన్నికలలో కూడా నాదే విజయం

ఈ ఎన్నికల్లోనే కాదు రానున్న, ఐదే లేదా ఏడు ఎన్నికలలో కూడా తనదే విజయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను వారాణసికి చెందినవాడినని, వారణాసి వినాశనం ఎరుగని నగరమని, అలాగే, తనను కూడా నాశనం చేయలేరని తేల్చి చెప్పారు. ‘‘మై తో అవినాశి హూం, మై తో కాశీ కా హూం.. కాశీ తో అవినాశి హై (నేను కాశీకి చెందినవాడిని.. నన్ను నాశనం చేయలేరు.. కాశీ వినాశనం ఎరుగనిది)’’ అంటూ విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ధీటుగా బదులిచ్చారు.

జూన్ 4 న మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగుస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హేళన చేసిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె చెప్పింది కరెక్టే. ఈ ప్రభుత్వం జూన్ 4తో ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అవునా కాదా? మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని ప్రధాని మోదీ బదులిచ్చారు. ప్రతిపక్ష పార్టీలను తాను శత్రువులుగా భావించడం లేదని, వారితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని, అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతల నుంచి నిర్మాణాత్మక విమర్శలు, సలహాలకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని స్పష్టం చేశారు.

భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు మూడు పర్యాయాలు వరుసగా ప్రధానిగా ఉన్న రికార్డును సమం చేయడం గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్ని పర్యాయాలు ప్రధానిగా ఉన్నారన్న విషయం కన్నా.. మోదీ పాలనలో భారతదేశం ఎంత పురోగతి సాధించిందో విశ్లేషకులు చెప్పాలని ఆయన చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు తనకు ఉన్నందున మోదీ మూడే కాదు.. ఐదు సార్లు లేదా ఏడు సార్లు కూడా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. బిహార్‌లోని పాటలీపుత్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ, ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. విపక్షాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

ఎల్​ఈడీ బల్బులు ఉండాల్సిన యుగంలో బిహార్‌ ప్రజలు లాంతర్లతో తిరుగుతున్నారని వివరించారు. ఆ లాంతరు లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇంటికి మాత్రమే వెలుగు నింపిందనీ, యావత్‌ బిహార్‌ను అంధకారమయం చేసిందని మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురిని ప్రధానులను చేస్తుందని పునరుద్ఘాటించారు. కష్టపడుతున్న మోదీకి, అబద్ధాలు చెబుతున్న ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని వివరించారు.

ఈ 2024 ఎన్నికల్లో ఒక వైపు మీ అందరి కోసం 24 గంటలు కష్టపడుతున్న మోదీ, మరో వైపు 24 గంటలు మీకు అబద్ధాలు చెప్పే ఇండియా కూటమి ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్​గా చేయడం కోసమే 24 గంటలు పని చేస్తున్నా. దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఆధునికమైన రోడ్లు, రైల్వేలను నిర్మిస్తున్నా. మరోవైపు ఏమి పని లేని ఇండియా కూటమి ఉంది. కేవలం రేయింబవళ్లు మోదీని దూషించే పనిలో ఇండియా కూటమి నిమగ్నమై ఉంది’ అంటూ విమర్శించారు. 

`ఐదేళ్లలో ఐదు ప్రధానమంత్రులకు ఇండియా కూటమి ప్లాన్​ చేస్తుంది. అయిన ఇండియా కూటమి నాయకులు ఎప్పుడు తమ కుటుంబ సభ్యలను మాత్రమే ముందుకు తెస్తుంది. ఓటు బ్యాంక్​ కోసమే ఇండియా కూటమి మోదీని ఆరోపించే పనిలో 24 గంటలు బిజీగా ఉంది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు.