కేన్స్లో ఉత్తమ నటిగా అనసూయకు అవార్డు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చ‌రిత్ర సృష్టించింది. ఇందులో మ‌రో ముఖ్య విభాగమైన ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ కేటగిరీలో ఉత్త‌మ న‌టిగా అనసూయ అవార్డు అందుకుంది. ‘ది షేమ్‌లెస్‌’ అనే చిత్రానికి ఆమె ఈ అవార్డు అందుకోగా.. ఈ ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది.

అది కూడా తొలి సినిమాతోనే ఈ ప్రతిష్టాకర అవార్డును అందుకున్నారు.  గోవాలో ఉంటూ ముంబయిలో ప్రొడక్షన్ డిజైనర్​గా పనిచేసే ఆమెకు అన్ సర్టైన్ రిగార్డ్ సెగ్మెంట్‌లో ఉత్తమ నటి అవార్డు దక్కింది.  ఈ చిత్రంలో అన‌సూయ ‘రేణుక’ అనే వేశ్య పాత్ర ను పోషించింది. బల్గేరియన్ డైరెక్టర్ కాన్‌స్టంటిన్ బొజనోవ్ తెరకెక్కించిన ‘ద షేమ్ లెస్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు అనసూయ. ఈమెతో పాటు మితా వశిష్ట్ అనే ఫ్యామస్ యాక్టర్ కూడా ఇందులో నటించారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ను నెలన్నర పాటు ఇండియా, నేపాల్‌లో చిత్రీకరించారు.

77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శ్యామ్ బెనెగల్ నుంచి వచ్చిన మంతన్ తర్వాత 48ఏళ్లకు ఇండియన్ సినిమా షో పడింది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించి ఇంతటి గ్రాండ్ వేడుకలో అవార్డు అందుకున్న తొలి ఇండియన్​గా నిలిచారు అనసూయ. ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకుంటూ, దానిని క్వీర్ కమ్యూనిటీకి డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అవార్డును అందుకుంటున్న అనసూయ ఎమోషనల్ అవుతూనే ‘చాలా కమ్యూనిటీల వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుతూ జీవితంతో పోరాడుతున్నారు. వలసవాదులు ఎంత దయనీయంగా బతుకుతున్నారో మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు.

 బొజనోవ్‌కు ఫేస్‌బుక్ ఫ్రెండ్ అనసూయ. ఒకసారి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తూ ఆడిషన్ చేసి వీడియో పంపమని అడిగారు. యాక్టింగ్ అంటే తెలియన ఆమెకు ఆడిషన్ అదే ఫస్ట్ టైం. అలా సెలక్టైన ఆమె ‘ద షేమ్ లెస్’లో నటించే అవకాశం కొట్టేసింది. ఇందులో ఒక సెక్స్ వర్కర్ అయిన రేణుకా పాత్ర పోషించారీమె. సెక్స్ వర్కర్ అయిన రేణుక(అనసూయ) ఢిల్లీలో ఒక పోలీసుని మర్డర్ చేసి మరో రాష్ట్రానికి వెళ్లిపోతుంది. ఆ రాష్ట్రంలోనూ వేరే కమ్యూనిటీలో జాయిన్ అయి మరో సెక్స్ వర్కర్‌ను ప్రేమిస్తుంది. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవడం కోసం పోరాడుతుంది.

 రేణుకతో ప్రేమలో పడే మరో టీనేజర్ అయిన దేవికా పాత్రను ఒమర శెట్టి పోషించారు. ఇలా సాగుతున్న కథలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను ఎంత బాగా చిత్రీకరించారో, అంతే స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేశారు అనసూయ. అంతకంటే ముందు, శ్రీజిత్ ముఖర్జీ తీసిన ఫర్‌గెట్ మీ నాట్, సత్యజిత్ రే ఆంతాలజీ, మసబా మసబాలకు ప్రొడక్షన్ డిజైనర్​గా పనిచేశారు అనసూయ.