మంత్రి జైశంకర్‌కు అరుదైన అవకాశం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఆరో విడత పోలింగ్‌లో కేంద్ర విదేశాంగ మంత్రి  జైశంకర్‌ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. తొలి ఓటు వేసి ఎన్నికల సంఘం నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఉదయం పోలింగ్‌ బూత్‌ తెరవకముందే ఢిల్లీలోని పోలింగ్‌ కేంద్రం వద్ద లైన్‌లో నిల్చున్న జైశంకర్‌.. తొలి మేల్‌ ఓటు వేశారు. పోలింగ్ బూత్‌లో ఓటేసిన ఫస్ట్ మేల్ ఓటర్‌ కావడంతో సదరు పోలింగ్ బూత్ సిబ్బంది కేంద్ర మంత్రికి సర్టిఫికెట్ అందించారు. దానిని చూపిస్తూ జైశంకర్ ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

ఓ చేతిలో ‘ప్రౌడ్ టు బి ఫస్ట్ మేల్ ఓటర్ ’ సర్టిఫికెట్, మరో చేతి వేలికి సిరా గుర్తును చూపిస్తూ కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో ఫొటో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కేంద్ర మంత్రి ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 39.13 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో గరిష్టంగా 54.08 శాతం పోలింగ్ రికార్డయినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.

కాగా, బీహార్‌లో 36.48 శాతం పోలింగ్ నమోదు కాగా, హర్యానాలో 36.48, జమ్మూకశ్మీర్‌లో 35.11, జార్ఖాండ్‌లో 42.54, ఢిల్లీలో 34.37, ఒడిశాలో 35.69, ఉత్తరప్రదేశ్‌లో 37.23 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా, దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్‌ జరుగుతున్నది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలకు, బీహార్ (8), బెంగాల్ (8), హర్యానా (10), ఝార్ఖండ్ (4), ఉత్తరప్రదేశ్ (14), జమ్మూ కాశ్మీర్ లోని ఒక సీటుకు పోలింగ్ జరుగుతోంది. ఇక ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.