దేశ రాజధాని ఢిల్లీలో 2008లో జరిగిన బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా తేలిన అరిజ్ ఖాన్‌కు ఇవాళ ఢిల్లీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసు అని ఢిల్లీ కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్ సమయంలో ఇన్‌స్పెక్టర్ ఎంసీ శర్మ మరణానికి కారణమైన కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్ ఖాన్‌ను ఇటీవల ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది.
ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలనుబట్టి ఆరిజ్‌ఖాన్ అతడి సహచరులు జరిపిన కాల్పుల కారణంగానే ఇన్‌స్పెక్టర్ ఎంసీ శర్మ మృతిచెందినట్టు భావిస్తున్నామని అడిషనల్ సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్ పేర్కొన్నారు.
ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో అరిజ్ ఖాన్ ఒకడు. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో 30 మంది చనిపోగా వంద మందికిపైగా గాయపడ్డారు. అనంతరం 19న ఢిల్లీలోని జామియా నగర్‌లో బాట్ల హౌజ్ ఎల్ 18 వద్ద ఉగ్రవాది అరిజ్ ఖాన్, అతడి నలుగురు అనుచరులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టగా ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దేశంలో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ నాయకుడు, ఆపరేషన్స్ హెడ్ అతిఫ్ అమీన్‌తోపాటు మహ్మద్ సైఫ్, మహ్మద్ సాజిద్ ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
అయితే అరిజ్ ఖాన్, షాజాద్ అహ్మద్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు గాయdపడ్డారు. తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణానికి అరిజ్ ఖాన్, అతడి అనుచరులు కారణమని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
పారిపోయిన షాజాద్ అహ్మద్‌ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేయగా 2013లో కోర్టు అతడ్ని దోషిగా నిర్ధారించింది. అయితే అరిజ్ ఖాన్ మాత్రం పదేండ్ల పాటు పోలీసుల కళ్లగప్పి తప్పించుకున్నాడు. అజమ్‌గఢ్‌కు చెందిన అతను వృత్తిరీత్యా ఇంజినీర్. ఇండియన్ ముజాహిదీన్ కేడర్‌ను బలోపేతం చేయడం, కొత్తవారిని నియమించుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు.
ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చాడు. అరిజ్ ఖాన్‌పై పలు కేసులు నమోదు చేసిన ఎన్‌ఐఏ అతడిపై రూ.10 లక్షలు, బాట్లా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు. అరిజ్ ఖాన్‌ను 2018 ఫిబ్రవరిలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు